ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి కన్నుమూత

February 21, 2022

01

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆయన మరణించిన విషయాన్ని అపోలో వైద్యులు ఆయన భార్యకు సమాచారం అందించారు.

మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రస్థానం..

1971 నవంబర్‌ 2న జన్మించారు. తల్లిదండ్రులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి- మణిమంజరి. గౌతమ్‌ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి. 1994-1997లో ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు. ఆయన భార్య మేకపాటి శ్రీకీర్తి. పిల్లలు ఒక కుమార్తె, ఒక కుమారుడు. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. మొదటిసారి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైఎస్సార్ సీపీ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే‌గా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి రెండోసారి గెలుపొందారు. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

మరోపక్క విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లావాసులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గౌతమ్‌రెడ్డి డైలీ గంటలపాటు ఎక్సర్‌సైజ్‌ చేసేవారని, ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండేవారని తెలిపారు. ఆయన ఎక్కడ ఉంటున్నా కూడా జిమ్‌ ఏర్పాటుచేసుకుంటారని, హార్ట్‌ అటాక్‌ రావడమేంటని నమ్మలేకపోతున్నారు. నెల్లూరులోని ఆయన నివాసానికి వైసీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఆయ‌న పార్థివ దేహాన్ని హైద‌రాబాద్‌ అపోలో ఆసుప‌త్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసానికి ప‌లువురు నేత‌లు, బంధువులు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.