ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. బాలకృష్ణను చూస్తుంటే జాలేస్తోందన్నారు. చంద్రబాబు రాసే స్క్రిప్ట్ చదవడం మానేసి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడిగా బయటకు రావాలని సూచించారు.శనివారం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ది పెద్ద విగ్రహం పెడతామంటున్నారని… బాలకృష్ణకు ఇన్నేళ్లు నిమ్మకూరు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. 2019 వరకు తమరే అధికారంలో ఉన్నారు కదా.. నిమ్మకూరును అభివృద్ధి చేయాలని అప్పుడు అనిపించలేదా? అని నిలదీశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను తిట్టడానికే మహానాడు పెట్టుకున్నారని తెలిపారు. మహానాడులో తిట్టపురాణం తప్ప మరేమిలేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు నచ్చదని విమర్శించారు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదని ఎద్దేవా చేశారు.