AP Minister Usha Sri Charan Visits Tirumala Along With Followers, Devotees Fire
mictv telugu

ఏపీ మంత్రి ఓవరాక్షన్.. 50 మందితో శ్రీవారి బ్రేక్ దర్శనం

August 15, 2022

ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్‌ ఇవాళ తిరుమలలో హల్‌చల్‌ చేశారు. వరుస సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ ముందు జాగ్రత్తగా ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది. దివ్యాంగులు, పిల్లలు, వృద్ధుల దర్శనాలతో పాటు వీఐపీ దర్శనాలను, సిఫార్సు లేఖలపై దర్శనాలు సైతం రద్దు చేయడంతో మంత్రి ఉషాచరణ్‌ స్వయంగా రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి చేసి మరీ తన 50 మంది అనుచరులకు బ్రేక్‌ దర్శనాలు చేయించారు. అంతేకాకుండా మరో 10 మంది అనుచరులకు సుప్రభాత సేవ టికెట్లను ఇప్పించారు.

ఈ విషయంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను మంత్రి తోసుకుని వెళ్లిపోయారు. మంత్రి ఉష శ్రీచరణ్‌ తీరుపై విమర్శలు వస్తున్నాయి. దర్శనం కోసం సామాన్యులు క్యూలైన్లలో నిరీక్షిస్తుంటే మంత్రి తన అనుచరులకు బ్రేక్‌ దర్శనాలు ఇప్పించడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండురోజులుగా స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్న భక్తులను కాదని హోదా పేరుతో మంత్రి అధికార దుర్వినియోగం పట్ల మండిపడుతున్నారు.