AP: Monitoring app to go live..24 hours to go
mictv telugu

ఏపీ: అమల్లోకి పర్యవేక్షణ యాప్‌..ఇకపై 24 గంటలు

September 3, 2022

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో ‘ఆస్పత్రుల పర్యవేక్షణ యాప్‌’ను అమల్లోకి తీసుకొచ్చామని వైద్యశాఖ అధికారులు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా..ప్రభుత్వాస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణను నిత్యం పర్యవేక్షించి, సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలతోపాటు ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్‌ కంట్రోల్, బయోమెడికల్‌ పరికరాల నిర్వహణ, ఈ హెచ్‌ఆర్‌ తదితర అంశాలపై పర్యవేక్షణకై..ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఈ యాప్‌ను రూపొందించిందని పేర్కొన్నారు.

”రాష్ట్రవ్యాప్తంగా 175 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), 53 ప్రాంతీయ (ఏరియా) ఆస్పత్రులు, 17 జిల్లా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్, ఒక చెస్ట్‌ డిసీజెస్‌ ఆస్పత్రి ఉన్నాయి. వీటిలో 16,340 పడకల సామర్థ్యం ఉంది. ఈ ఆస్పత్రుల నిర్వహణ, సౌకర్యాల పర్యవేక్షణకు ‘ఏపీ హెల్త్‌ సెకండరీ కేర్‌’ యాప్‌ను రూపొందించాం. ఈ యాప్‌లో ప్రతి ఆస్పత్రికి ఒక లాగిన్‌ను కేటాయించాం. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లేదా ఆర్‌ఎంవో ఈ యాప్‌లో లాగిన్‌ అయి అందులోని మాడ్యూల్స్‌ ఆధారంగా వివరాలను నమోదు చేయాలి. ఆస్పత్రిలో సెక్యూరిటీ విధానం, సెక్యూరిటీకి స్కోరింగ్, శానిటేషన్, పెస్ట్‌ కంట్రోల్‌ తదితర అంశాలపై స్కోరింగ్‌ ఇవ్వాలి. అనుబంధ ప్రశ్నలకు ఎస్‌/నో రూపంలో సమాధానాలివ్వాలి. వాటికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. ఉదాహరణకు.. ఆస్పత్రిలో రోగుల రక్షణకు సంబంధించిన సెక్యూరిటీ విజిట్‌ మాడ్యూల్‌లో సెక్యూరిటీ గార్డ్‌ 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడా? లేడా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. గార్డ్‌ అందుబాటులో ఉన్నాడని ‘ఎస్‌’ అని పెడితే వెంటనే లైవ్‌ ఫొటో అప్‌లోడ్‌ చేయాలని యాప్‌ అడుగుతుంది. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ లైవ్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి” అని అధికారులు వివరాలను వెల్లడించారు.