ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల జీవితాలు ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టు మారిపోయాయి. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య చిక్కి నలిగిపోతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు చేస్తే విపక్షాలకు కోపమొస్తుంది. నిబంధన ప్రకారం నడుచుకుంటూ ప్రభుత్వ పెద్దల ఇష్టప్రకారం నడుచుకోకపోతే అధికార పార్టీ కోపం చవిచూడాల్సి వస్తుంది. ఈ గొడవ భరించలేక కొంతమంది ఉద్యోగాలు మానుకున్నారు కూడా. ఈ పరిస్థితికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అద్దపడుతున్నాయి.
టీడీపీపై సానుభూతి చూపే వలంటీర్లను ఉద్యోగాల నుంచి పీకేస్తామని ఆయన హెచ్చరించారు.
‘‘మా సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ సానుభూతిపరులకు కూడా వలంటీర్ పోస్టులు ఇచ్చాం. వారి ప్రవర్తన మారుతుందేమోనని ఆశించాం, కానీ అలా జరగలేదు. కొంతమంది మారలేదు. అలాంటి వారిని గుర్తించి తీసేస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. కొండపల్లిలో జరిగిన వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే హెచ్చరికపై విమర్శలు వస్తున్నాయి. తెలుగు దేశం పార్టీపై సానుభూతి చూపుతున్న వలంటీర్లను గుర్తించి తమకు వివరాలను అందించాలని ఆయన స్థానిక నేతలను, వైకాపా కార్యకర్తలను కోరారు.