AP: New guidelines in effect..Applications from today
mictv telugu

ఏపీ: అమల్లోకి కొత్త మార్గదర్శకాలు..నేటి నుంచి దరఖాస్తులు

August 2, 2022

ఆంధప్రదేశ్‌లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. అంతేకాదు, నూతన మార్గదర్శకాలపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను డెప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు.

ఈ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి ముఖేష్‌ కుమార్‌ మీనా మీడియాతో మాట్లాడుతూ..”ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్‌ 30న ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లో సవరణలు చేశారు. సవరించిన చట్టంలోని సెక్షన్‌ 23 ప్రకారం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితోపాటు ఓటర్లుగా నమోదు కావాలనుకునేవారు వచ్చే మార్చి నెలాఖరుకల్లా ఆధార్‌ సంఖ్యను పొందుపర్చాలి. ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి, జాబితాలో వ్యక్తులను ప్రామాణీకరించడానికి, ఒక వ్యక్తి పేరు ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చూడటమే ఆధార్‌ సంఖ్య సేకరణ ప్రధాన ఉద్దేశం. అంతేకాదు, ఇది పూర్తిగా స్వచ్ఛందం. ఆధార్‌ నంబరును సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగించటం అనేది ఉండదు” అని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారు అలాగే, ఆధార్‌ సంఖ్యను పొందుపర్చాలని ఎదురుచూస్తున్నవారు..ఎలా ఆప్లై చేయాలి? ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లోనా? ఎప్పటి నుంచి దరఖాస్తులు మొదలు అవుతాయి అనే తదితర విషయాలను అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ”ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్‌ నంబరు కోసం నూతనంగా ఫారమ్‌ 6బిని అధికారులు ప్రవేశపెట్టారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్‌వీఎస్‌పీ, వీహెచ్‌ఏ తదితర వెబ్‌‌సైట్‌లలో నూతన దరఖాస్తులు అందుబాటులో ఉంచారు. 6బి దరఖాస్తును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానంలో ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చు. ఎన్‌వీఎస్‌పీ, ఓటర్ల హెల్ప్‌లైన్‌ యాప్‌ని అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యూఐడీఐఏతో రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నెంబరు ఓటీపీని ఉపయోగించి ఆధార్‌ను ప్రామాణీకరించవచ్చు. ఈ ప్రక్రియ నేటి నుంచే మొదలు అవుతుంది”  అని అధికారులు తెలిపారు.

అయితే, బూత్‌ లెవల్‌ అధికారి ఓటర్ల నుండి ఆధార్‌ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆధార్‌ నంబరు ఇవ్వలేని ఓటర్లు ఫారం 6బిలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయపత్రాలలో ఏదైనా ఒకటి సమర్పించాలని సూచించారు.