రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. పార్టీకి చెందినా బడా నేతలతో పాటు క్యాడర్ కూడా గోడ దూకడంతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడుచుకుపెట్టుకుపోయింది. అధిష్టానం కూడా ఏపీలో పార్టీ బలోపేతానికి పటిష్ట చర్యలు చేపట్టకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సైతం అంతగా కనిపించ లేదు. ఆ పార్టీ చీఫ్‌గా రఘువీరారెడ్డి తప్పుకున్న తర్వాత ఆ పదవి శైలజానాథ్‌కు అప్పగించినా పెద్దగా మార్పులు ఏం కనిపించలేదు. ఇటీవల మరోసారి కాంగ్రెస్ నాయకత్వంలో మార్పులు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి శైలజానాథ్‌ను తప్పించి గిడుగు రుద్రరాజుకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ పగ్గాలు చేపట్టాక గిడుగు రుద్రరాజు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లో మరోసారి మెగస్టార్ చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు.
చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారంటూ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. ఒంగోలులో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం జిల్లా కమిటీలు, నాయకులను సిద్ధం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అక్రమాలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈనెల 26 నుంచి మార్చి 26 వరకు పార్టీ కార్యకర్తలు పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని గిడగు రుద్రరాజు విమర్శించారు.