ఏపీ ప్రజలు అలర్ట్.. 'అసని' ముంచుకొస్తుంది - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రజలు అలర్ట్.. ‘అసని’ ముంచుకొస్తుంది

May 9, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ, అనంతపురం, కడప జిల్లాల ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ‘అసని’ రూపంలో పెను తుఫానుగా మారి ముంచుకొస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇప్పటికే ‘అసని’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు భారీగా కురుస్తున్న విషయం తెలిసిందే.

”అసని కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెంలో వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్‌ స్తంభించింది. కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో ఈదురు గాలులకు చెట్లు విరిగి, రోడ్లపై పడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఎక్కువ చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి” అని వాతావరణ శాఖ పేర్కొంది.

మరోవైపు అధికారులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.