ఏపీ ప్రజలు చూస్తున్నారు.. చిడతలు కొట్టకండి: స్పీకర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రజలు చూస్తున్నారు.. చిడతలు కొట్టకండి: స్పీకర్

March 23, 2022

04

ఏపీలో ఈనెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు మొదలైన రోజు నుంచి నేటీవరకు టీడీపీ నేతలు సభలో నిరసనలు, నినాదాలు చేస్తూ వాకౌట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిర‌స‌న తెలిపారు. క‌ల్తీసారా, జై బ్రాండ్ మ‌ద్యంపై స‌భ‌లో చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు. అందుకు స్పీక‌ర్ అంగీక‌రించ‌లేదు. దీంతో ప్రశ్నోత్తరాల వేళ‌ అమూల్‌పై అడిగిన ప్రశ్నకు ప్ర‌భుత్వం స‌మాధానాలు చెబుతుండ‌గా, టీడీపీ సభ్యులు స‌భ‌లో చిడతలు కొట్టారు.

అయినా అవేమి పట్టించుకోకుండా ప్ర‌భుత్వం స‌మాధానాలు చెప్పింది. అమూల్ వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంద‌ని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. చిడతలు కొట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంస్కారం, ఇంగిత జ్జానం లేదా? అని ప్ర‌శ్నించారు. టీడీపీ స‌భ్యులు శాసనసభ గౌర‌వాన్ని త‌గ్గించేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అనంతరం సభలో విజిల్స్ కూడా ఎందుకు వేశార‌ని, ఇటువంటి భజనలు ఇక్కడ కాకుండా వేరే చోట్ల చేసుకోవాల‌ని అన్నారు. ఎమ్మెల్యేల‌కు ఓటేసిన ప్రజలు చూస్తున్నారని, ఇటువంటి పిల్ల చేష్టలు త‌గ‌వ‌ని అన్నారు. చంద్రబాబు చివ‌ర‌కు చిడతలు కొట్టుకోవాల్సిందేనంటూ వైసీపీ స‌భ్యులు స‌భ‌లో ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులు సభకు మ‌ద్యం తాగి వ‌స్తున్నారేమోన‌ని ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు అనుమానాలు వ్య‌క్తం చేశారు. క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై అసెంబ్లీలో చ‌ర్చించేందుకు ఏపీ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌ని టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు.