ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నంలో వైద్య విద్యను అభ్యసించాలని ఆశగా ఉన్న ఏపీ విద్యార్థినీ, విద్యార్థులకు జగన్ సర్కార్ మరో శుభవార్తను చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం 2023–24 నుంచి కొత్తగా 5 వైద్య కళాశాలలకు అనుమతులు ఇస్తూ, మంగళవారం ఉత్తర్వూలు జారీ చేసింది.
దీంతో ఒక్కో కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లతోపాటు, అకడమిక్ కార్యకలాపాలను అధికారులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయా కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను నియమించారు. ఆయా జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా మార్పు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం అఫ్లియేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా కళాశాలలు గురువారం నుంచి ఎన్ఎంసీకి దరఖాస్తు చేయబోతున్నట్టు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు.
డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ..” రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య కోసం ప్రభుత్వం మరో ఐదు కళశాలలకు అనుమతులు ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన జగన్ సర్కార్.. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఐదు కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఇప్పటికే ఉన్న సీట్లకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు లభిస్తాయి.” అని ఆయన అన్నారు.