సుచరిత సీరియస్.. రేపోమాపో కీచక ఫాదర్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

సుచరిత సీరియస్.. రేపోమాపో కీచక ఫాదర్ అరెస్ట్

June 14, 2019

AP Police are preparing for the arrest of Father Thadipatri Sunkulamma Palam Church..

తాడిపత్రి సుంకులమ్మ పాలెం చర్చి ఫాదర్‌ అరెస్టుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫాదర్ ఏమిలిరాజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే అతణ్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. తాడిపత్రికి చెందిన కమలమ్మ కుమార్తె చర్చి స్కూలులో 8వ తరగతి చదువుతోంది. 2018 సెప్టెంబరులో బాలిక(13) చర్చికి వెళ్లిన సమయంలో చర్చి ఫాదర్‌ ఎమిలిరాజ్‌.. సదరు బాలికతోపాటు మరికొందరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారిని ఇంటికి పిలిపించుకుని ఒంటిపై దుస్తులు విప్పేసి నగ్నంగా పడుకుని బాడీ మసాజ్‌ చేయాలని కోరాడు. ఈ విషయం బాలిక తన తల్లికి చెప్పగా, ఆమె  పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, అప్పటి సీఐ సురేందర్ రెడ్డి ఫాదర్‌కు మద్దతు పలికారు. పంచాయితీతో రాజీకి యత్నించారనే విమర్శలు వున్నాయి.

ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ఆదేశాలతో తాడిపత్రి పోలీసులు 2019 మార్చి 30న చర్చి ఫాదర్‌పై కేసు నమోదు చేశారు. కానీ, ఎమిలిరాజ్‌ను అరెస్ట్‌ చేయలేదు. మూడురోజుల క్రితం హోంమంత్రి మేకతోటి సుచరితకు బాధిత బాలిక తల్లి ఫోన్‌ చేసి తన బాధను చెప్పింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి.. పోలీసులకు ఫోన్‌ చేసి చర్చి ఫాదర్‌ను అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు మంగళవారం రాత్రి ఎమిలిరాజ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లగా.. చర్చి కమిటీ సభ్యులు, మహిళలు అడ్డుకున్నారు. కమలమ్మ ఆరోపణలు అసత్యమని, చర్చి ఫాదర్ మంచివాడంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ చర్యతో చర్చి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. చేసేది లేక పోలీసులు వెనుదిరిగారు.

ఈ ఘటనపై స్థానిక పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. వారి తీరుపై బాధిత బాలిక తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగుతానని ఆమె హెచ్చరిస్తున్నారు. కాగా, చర్చి ఫాదర్‌ పరారయ్యాడని.. అతడిని మరో చర్చికి బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది.