కృష్ణా, రామా.. అంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన ఈ బామ్మ గారు.. చోరీలకు పాల్పడుతూ సాహస కృత్యాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తుందో, ఎవరికోసం చేస్తుందో తెలియదు. ఏదైనా ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిస్తే చాలు. వెంటనే అక్కడికి చేరుకొని భక్తితో పూజలు చేసి, శ్రద్ధతో అక్కడున్న మహిళల మెడల్లోని బంగారం కాజేస్తుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన జవంగుల సరోజిని అలియాస్ సామ్రాజ్యం అనబడే చోరీమణి కథ ఇది. వయసు 75 ఏళ్లు. ఆమెపై ఉన్న కేసులు 100 కి పైనే. పోలీసులకు ఈమె మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.
ఇటీవల కృష్ణా జిల్లా నందిగామ మండలం చెర్వుకొమ్మపాలెంలోని ఓ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. ఉత్సవాల్లో కొందరు మహిళల మెడలో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా.. అసలు దొంగెవరో తెలిసి ఆశ్చర్యపోయారు. అంతెందుకు కంప్లైంట్ ఇచ్చిన మహిళలకైతే ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. మొదట పొరపాటు పడుతున్నామేమో అనుకున్నారు. తీరా ఆరా తీస్తే 75 ఏళ్లు వయసున్న సామ్రాజ్యం అత్యంత లాఘవంగా చోరీలు చేస్తుంది. ఆమెసు అదుపులోకి తీసుకున్న పోలీసులు 99గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఐతే ఈ వయసులో ఆమె దొంగగా మారడానికి కారణాలేంటి.. కాటికి కాలుచాచిన వయసులో ఇలాంటి బుద్ధి ఎందుకొచ్చిందనేది మాత్రం తెలియలేదు.