లైక్‌లు వస్తాయని చేశాడో, లేదంటే వ్యూస్ పెరుగుతాయని చేశాడో కానీ ఓ వ్యక్తి సిగ్గుమాలిన పని చేశాడు. కట్టుకున్న భార్యతో ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నాలుగు గోడల మధ్య రహస్యంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని వాట్సాప్ లో పెట్టాడు. ఏపీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. కాట్రేనికోన మండలంలోని ఓ తీర ప్రాంత గ్రామానికి చెందిన యువకుడి(20)కి ఫిబ్రవరి 8వ తేదీన అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో వివాహమైంది. ఆ తర్వాత వారికి పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు. ఆ యువకుడు తన భార్యతో కలిపిన మొదటి రాత్రి దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. దీంతో ఆమె గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆ యువకుడిని 28వ తేదిన అరెస్టు చేశారు. కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించారని కాట్రేనికోన ఎస్సై టి.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. అయితే.. ఘటన జరిగిన వెంటనే బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడిందట. కానీ అధికార పార్టీ ప్రాబల్యం ఉన్న ఆ గ్రామపెద్దలు ప్రైవేటు పంచాయితీ చేసి కప్పిపుచ్చేందుకు యత్నించినట్లు సమాచారం.