ఏపీ ఎస్సై ప్రాథమిక పరీక్ష రేపు జరగనుంది. దీనికి సంబంధంచిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 291 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30-5.30 మధ్య పేపర్-2 పరీక్ష జరగనుంది. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులను మొదటి పేపర్ పరీక్షకు 9 గంటల తర్వాత.. రెండో పేపర్ పరీక్షకు మధ్యాహ్నం 01 .30 తర్వాల ఎగ్జామ్ హాల్ లోకి అనుమతిస్తారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ సహా ఏదో ఒక గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకురావాలి.
వీటికి నో ఎంట్రీ
ఎగ్జామ్ సెంటర్ విషయంలో గందరగోళ పరిస్థితి ఉండకుండా అభ్యర్థుల ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించుకుంటే మంచిది. ఇక మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్‌వాచ్, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, చార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎంట్రీ లేదు. ఇలాంటి వాటితో పరీక్షకు వచ్చినా భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండవు. హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ / బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలి.
ఒక్కో పోస్టుకు 418 మంది పోటీ
సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (SLPRB AP) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 6100 కానిస్టేబుల్ పోస్టులకు ఇప్పటికే ప్రాథమిక పరీక్షను నిర్వహించి ఫలితాలను విడుదల చేశారు. ఇక రేపు జరగనున్న 411 ఎస్సై పోస్టులకు దరఖాస్తులు భారీ స్థాయిలో వచ్చాయి. ఇప్పటి వరకు ప్రాథమిక పరీక్ష కోసం 1,71,396 మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఒక్కో పోస్టుకు 418 మంది పోటీపడుతున్నారు.