AP police stopped the Ayyappa Puja because there was no permission in West Godavari
mictv telugu

అనుమతి లేదని.. అయ్యప్ప పూజను అడ్డుకున్న ఏపీ పోలీసులు

November 6, 2022

ఏపీలో అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు.. ప్రజల పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వేరే పార్టీలకి , వేరే సామాజిక వర్గాలకి మద్ధతు తెలుపుతున్నారని.. అధికార పార్టీకి చెందిన నేతలే ఇదంతా చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో పలు రాజకీయ నాయకుల పర్యటనలు, సభలు నిర్వహించడానికి.. ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోలేదనే కారణంతో వాటిని నిలిపివేసిన ఘటనలు చాలానే జరిగాయి.

తాజాగా అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజలు నిర్వహించడానికి కూడా అనుమతి తీసుకోలేదనే కారణంతో పూజలను మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరం మండలం సుంకర పెద్దయ్య వీధికి చెందిన కొందరు అయ్యప్ప మాలధారులు.. శనివారం రాత్రి అయ్యప్ప పడిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పడిపూజకు అనుమతి లేదంటూ పోలీసులు, మున్సిపల్‌ అధికారులు వారిని అడ్డుకున్నారు. అయ్యప్ప మాలధారులు ఎంత వేడుకున్నా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, అయ్యప్ప మాలధారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా, అయ్యప్ప మాలధారులు.. వీధుల్లో భజనలు, కీర్తనలు చేస్తూ భీమవరం బస్టాండ్‌ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.