ఏపీలోని టీడీపీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఆకస్మిక గుండెపోటుతో ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు నెల రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం పార్టీని కలవరానికి గురిచేస్తున్నది. మొన్న తారక రత్న, నిన్న బచ్చుల అర్జునుడు, తాజాగా పరుపుల రాజా అకాల మరణంపై పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా వ్యవరిస్తున్న పరుపుల రాజా(46)కు శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి చెందినట్టు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం మూడు రోజులుగా బొబ్బిలి, సాలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావుకు మద్దతుగా రాజా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రమే ఆయన ప్రత్తిపాడు వచ్చారు. రాత్రి 9 గంటలకు ఆయనకు గుండెపోటు రాగా.. హుటాహుటిన కాకినాడ సూర్య గ్లోబల్ ఆసుపత్రికి, ఆ తర్వాత అక్కడ పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో రాత్రి 10 గంటల సమయంలో అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో అడుగు పెట్టిన వెంటనే కుప్పకూలిపోయారు. సీపీఆర్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. దీంతో రాత్రి 11 గంటలకు రాజా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హాయాం లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అధ్యక్షునిగా రాజా పనిచేశారు. వరుపుల రాజా అసలు పేరు జోగిరాజు కాగా అందరూ ఆయన్ను రాజా అని పిలుస్తుంటారు. రాజాకు భార్య సత్యప్రభ, కుమార్తె సత్యమాధురి, కుమారుడు సాయితర్షిత్ ఉన్నారు. బీకాం వరకు చదివిన రాజా స్వస్థలం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామం. రాజా భౌతికకాయాన్ని ప్రత్తిపాడుకు తరలించారు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు. ఈరోజు రాజా అంత్యక్రియలు జరగనున్నాయని సన్నిహితులు తెలిపారు.