AP: PRC for employees from next month
mictv telugu

ఏపీ: ఉద్యోగులకు బొత్స తీపీకబురు..వచ్చే నెల నుంచే పీఆర్సీ

September 14, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ తీపికబురు చెప్పారు. వచ్చే రెండు నెలల్లో సీపీఎస్‌ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామని, అలాగే, ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్‌ ఒకటోవ తేదీ నుంచి పీఆర్సీతో కలిపి జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

విజయనగరంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ..”రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని సంవత్సరాలుగా ఆయా శాఖల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేస్తాం. ఈ అంశంపై క్యాబినెట్‌లో ప్రతిపాదన పెట్టాలని సబ్‌ కమిటీ సభ్యులకు, జగన్‌‌కు సూచించాం. వచ్చే నెల మొదటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీతో కలిపి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంపై నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. అది కూడా రెండు నెలల్లోనే పరిష్కారమవుతుంది” అని ఆయన అన్నారు.

అనంతరం 2003, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి సీపీఎస్‌, ఓపీఎస్‌ రెండింటిలో ఏదో ఒకటి వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయమై నెలరోజుల్లో క్లారిటీ ఇస్తామన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. తన శాఖలో టీచర్లు మొదలుకుని ప్రొఫెసర్ల వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు.