AP pushes Telangana behind in GST collection
mictv telugu

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణను వెనక్కి నెట్టేసిన ఏపీ

June 2, 2022

జీఎస్టీ వసూళ్లలో ధనిక రాష్ట్రమైన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ అధిగమించింది. ప్రతీ ఏడు జీఎస్టీ వసూళ్లలో భారీ వృద్ధిని నమోదు చేసుకుంటూ వస్తున్న ఏపీ.. గడచిన మే నెలలో జాతీయ వృద్ధిని సైతం దాటేసింది. మంగళవారంతో ముగిసిన మే నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం బుధవారం వెల్లడించింది. వాటి ప్రకారం చూస్తే.. ఏపీలో రూ. 3047 కోట్ల జీఎస్టీ వసూలైంది. గతేడాది ఇదే నెలలో వసూలైన మొత్తం రూ. 2074 కంటే దాదాపు వెయ్యి కోట్లు ఎక్కువ వచ్చింది. అంటే 47 శాతం వృద్ధి నమోదైంది.

తెలంగాణకు వస్తే ఈ ఏడు మే నెలలో రూ. 3982 కోట్లు వసూలైంది. గతేడాది మే నెలకు సంబంధించి రూ. 2984 కోట్లతో పోలిస్తే 33 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. అంటే వసూలైన మొత్తం పరంగా చూస్తే అంకెల పరంగా తెలంగాణ ముందున్నా.. వ‌ృద్ధిలో మాత్రం తెలంగాణను ఏపీ దాటేసింది. ఇవే లెక్కలను జాతీయ స్థాయిలో చూస్తే వృద్ధి శాతం 44 గా ఉంది. ఈ లెక్కన దేశీయ వృద్ధి శాతం కంటే ఏపీ వృద్ధి శాతమే ఎక్కువ. అంకెల పరంగా జాతీయ స్థాయిలో చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 1.68 లక్షల కోట్లు వసూలైంది. మే నెలలో రూ. 1,40,885 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో తగ్గాయి. అదే గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది 44 శాతం పెరుగుదల కనిపించింది.