AP: Rs.450k for prep tablets
mictv telugu

ఏపీ: రూ.450కే ప్రెప్‌ మాత్రలు

July 11, 2022

jagan...

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్‌ వైరస్‌‌ని అరికట్టడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. హైరిస్క్‌ వర్గాల వారికి ప్రీ–ఎక్స్‌పోజర్‌ ప్రొఫైలాక్సిస్‌ (ప్రెప్‌) అనే ఔషధాలను అందజేయడానికి చెన్నైకి చెందిన వలంటరీ హెల్త్‌ సొసైటీ (వీహెచ్‌ఎస్‌)తో కలిసి మాత్రలను పంపిణీ చేయడానికి ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సిద్దమైంది. ప్రస్తుతం ఈ ఎయిడ్స్ ప్రెప్‌ మాత్రలు బహిరంగ మార్కెట్‌లో 30 మాత్రల ధర రూ.2 వేలుగా ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.450కే పంపిణీ చేస్తోందని ఇప్పటికే ఈ మాత్రలను విజయవాడ, వైజాగ్‌లలో పంపిణీని ప్రారంభించామని అధికారులు తెలిపారు.

ఈ ప్రెప్‌ మాత్రలు దేనికి ఉపయోగపడుతాయి అనే విషయానికొస్తే..”కండోమ్‌ వినియోగంలో పొరపాట్లు, ఇతర సురక్షితం కాని శృంగారం వల్ల కలిగే ఎయిడ్స్‌ వ్యాప్తిని ఈ మాత్రలు నిరోధిస్తాయి. దానితోపాటు హైరిస్క్‌ వర్గాలుగా పరిగణించే ఫీమేల్‌ సెక్స్‌ వర్కర్లు, స్వలింగ సంపర్కులు (మేల్‌ హోమో సెక్సువల్స్‌), ట్రాన్స్‌జెండర్లు, ఇంజెక్షన్ల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునేవారికి ఈ మాత్రలు బాగా పనిచేస్తాయి. ఎయిడ్స్‌ హైరిస్క్‌ వర్గాల్లో ట్రాన్స్‌జెండర్లు ఒకరు. సమాజంలో వివక్షకు లోనయ్యే వీరికి వైద్యంతోపాటు సామాజిక తోడ్పాటు అందించడానికి విజయవాడ, వైజాగ్‌లలో ట్రాన్స్‌జెండర్స్‌ వన్‌స్టాప్‌లను ఏర్పాటు చేశాం. ఈ సెంటర్‌లో వైద్యుడు, ఏఎన్‌ఎం, సిబ్బంది ఉంటారు” అని అధికారులు తెలిపారు.

ఇప్పటికే విజయవాడ జీజీహెచ్, విశాఖ కేజీహెచ్‌లలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు సైతం ఏర్పాటు చేశామని, ఈ డెస్క్‌ల ద్వారా ట్రాన్స్‌జెండర్‌లకు ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అవగాహన కల్పించి, వైద్య సహాయం అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధి, న్యాయపరమైన సహకారం, హైరిస్క్‌ గ్రూపుల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా ఇక్కడ సహాయంతోపాటు ఇక్కడే ప్రెప్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నామని, త్వరలో తిరుపతి, కర్నూలు, కాకినాడల్లో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రెప్‌ మాత్రలు పంపిణీ చేస్తామని అధికారులు వివరాలను వెల్లడించారు.