ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పదోవ తరగతి ఫైనల్ పరీక్షల ఫలితాల విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలకు, ట్యుటోరియల్ సంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. టెన్త్ ఫలితాలపై మా సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలకు, ఇతరులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ..”విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అందుకు సంబంధించిన 83వ నంబరు జీవోను బుధవారం జారీ చేసింది. గతంలో ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ట్యుటోరియల్ విద్యా సంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ, మా సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ, విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నారు. అలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలని, విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది” అని ఆయన అన్నారు.
ఇక, ఇటీవలే పదోవ తరగతి పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్ష ఫలితాల విషయంలో అధికారులు స్పష్టతనిచ్చారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మూల్యాంకనాన్ని ముగించిన ఎస్సెస్సీ బోర్డు.. ఆ వివరాల కంప్యూటరీకరణ వంటి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. టెన్త్ ఫలితాలను పదో తేదీలోపు విడుదల చేయాలని బోర్డు అధికారులు ఉన్నట్లు సమాచారం.