ఏపీ సీన్... రైల్వే లారీలో అక్రమ మద్యం రవాణా  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సీన్… రైల్వే లారీలో అక్రమ మద్యం రవాణా 

September 29, 2020

AP Scene ... Illegal liquor transport in a railway lorry

తెలంగాణ నుంచి ఏపీకి సాగుతున్న అక్రమ మద్యం రవాణా పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంత నిఘా ఉంచినా ఏదో విదంగా కొందరు మద్యం సరఫరా చేస్తూ పట్టుబడుతునే ఉన్నారు. కూరగాయల వ్యాను, ఇసుక లారీలు, గ్యాస్ సిలిండర్లు, అంబులెన్స్, చేపలు తరలించే వ్యాన్, బియ్యం బస్తాలు, ఒంటికి ప్లాస్టర్లు అంటించుకుని, పాల వ్యాన్‌లు.. ఇలా రకరకాల దారుల్లో పోలీసుల కళ్లుగప్పి ఏపీకి మద్యం సరఫరా చేస్తున్నారు. పోలీసులు పట్టుకుని బొక్కలో వేస్తున్నా.. మాదాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారేమో. మరిన్ని కొత్తమార్గాల్లో తరలించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా, తెలంగాణలో తక్కువగా ఉండటంతో దానిని క్యాష్ చేసుకుందామనుకుని బోల్తాకొడుతున్నారు. 

ఈ సారి ఏకంగా ప్రభుత్వ వాహనానంలోనే మద్యం రవాణాకు పూనుకున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన లారీ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోంది. ఆ లారీలో ఉన్న రైల్వే స్క్రాప్ మెటీరియల్ కింద 63 ఖరీదైన మద్యం బాటిళ్లను దాచారు. ముగ్గురు రైల్వే టెక్నీషియన్లే ఈ పనికి పూనుకున్నారు. అయితే వారి ప్లాన్ బెడిసికొట్టింది. కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులకు వారి వాహనం మీద అనుమానం కలిగింది. దీంతో తనిఖీలు నిర్వహించగా రైల్వే స్క్రాప్ మెటీరియల్ కింద దాచి ఉంచిన 63 ఖరీదైన మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు రైల్వే టెక్నీషియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితం కంచికచర్ల పోలీసుల తనిఖీల్లో పాల వ్యాన్‌లో మద్యం తరలిస్తూ కొందరు దొరికిపోయారు. దీంతో మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మద్యం రవాణాకు వినియోగిస్తున్న పాల వ్యాన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.