ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గౌరవం మళ్లీ లభించింది. ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. కోనసీమ ప్రబల తీర్థం పేరుతో సంక్రాంతి నేపథ్యంలో రూపొందించిన శకటానికి అవకాశం దక్కింది. దక్షిణ బారత దేశం నుంచి ఏపీ, కేరళ, తమిళనాడులకు అవకాశం దక్కగా తెలంగాణకు మొండిచేయి ఎదురైంది. గతేడాది ఇరు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అవకాశం రాలేదు. అంతకు ముందు ఏడాది ఏపీ లేపాక్షి ఆలయ శకటానికి ఛాన్స్ రాగా, తెలంగాణకు దక్కలేదు. గతేడాది మొత్తం 12 రాష్ట్రాలు, 9 శకటాల ప్రదర్శనకు అనుమతులు వచ్చాయి. అయితే శకటాల ఎంపికను నిపుణుల కమిటీ మాత్రమే నిర్ణయిస్తుందని, ఇందులో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా శకటం ప్రదర్శనకు అవకాశం రాకపోవడం తెలంగాణ ప్రజలకు ఒకింత నిరాశ కలిగించే అంశమేనని చెప్పవచ్చు.