ఏపీ: ఆన్‌లైన్ మోసానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ: ఆన్‌లైన్ మోసానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

July 4, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుంది. ఏమైందో ఏమో తెలియదు గాని శనివారం సాయంత్రం తన తల్లికి వాట్సాప్ ద్వారా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో ఉన్న చెరువులో తాను దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు మేసేజ్ పంపింది. వెంటనే శ్వేతా తల్లి చిల్లకల్లు పోలీసులకు సమాచారాన్ని అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అప్పటికే శ్వేతా బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ”నవులూరుకు చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. మూడు నెలలుగా ఇంటి నుంచే పని చేస్తోంది. అయితే, వర్క్ ఫ్రం హోమ్‌కి స్వస్తి పలికి నేరుగా ఆఫీసులోనే విధులు నిర్వర్తించాలని కంపెనీ యాజమాన్యం సూచించింది. దాంతో శ్వేతా ఆదివారం తెల్లవారుజామున బంధువులతో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం 5 గంటలకు స్కూటీపై బయటకు వచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని తల్లి ఫోన్‌కు సందేశం పంపింది. తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో శ్వేత తల్లిదండ్రులు చిల్లకల్లుకు వచ్చి ఫిర్యాదు చేశారు” అని వివరాలను వెల్లడించారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం రాత్రి నుంచి శ్వేతా మృతదేహాం కోసం గాలింపు చర్యలు ప్రారంభించగా, ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మృతదేహం లభించింది. అనంతరం జాస్తి శ్వేతా చౌదరి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించారు.” ఆన్‌లైన్‌లో జరిగిన మోసమే శ్వేతా ఆత్మహత్యకు కారణమైంది. అపరిచిత వ్యక్తి ఆన్లైన్‌లో ఆమెకు పరిచయమై రూ.1.2 లక్షలు చెల్లిస్తే, రూ.7 లక్షలు తిరిగి వస్తాయని ఆశ చూపాడు. దాంతో తనవద్ద డబ్బుల్లేవని ఆమె చెప్పడంతో ఆ వ్యక్తే రూ.50వేలను ఆమె ఖాతాకు పంపాడు. మిగిలిన మొత్తం కలిపి అతను చెప్పిన ఖాతాకు పంపమన్నాడు. దశల వారీగా మరో రూ.13 లక్షలు కట్టించుకున్నాడు. రెండు రోజులుగా ఆ వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్వేత ఆత్మహత్యకు సిద్ధపడి ఉంటుంది” అని పేర్కొన్నారు.