ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ(74) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం తిరుపతి నగరంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కుతూహలమ్మ మృతి పట్ల టీడీపీ, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.
వృతి పరంగా వైద్యురాలైన కుతుహలమ్మ..1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయంలోకి ఆరంగ్రేటం చేశారు. చిత్తూరు జడ్పీ ఛైర్పర్సన్గా ప్రస్థానం మొదలుపెట్టి మంత్రి వరకు ఎదిగారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989,1999,2004లోనూ అదే స్థానం నుంచి అసెంబ్లీకి వెళ్లారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు.
1991 – 93 మధ్యలో ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గా కుతూహలమ్మ పనిచేశారు. 1999 – 2003 మధ్య అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలిగా, 2007 – 2009 మధ్య అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన కుతూహలమ్మ 2014లో రాష్ట్ర విభజనతర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జీడీనెల్లూరు నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తి స్ధాయిలో దూరంగా ఉంటూ తన చిన్న కుమారుడు హరికృష్ణను రాజకీయ ప్రవేశం చేయించారు.