AP: The RTC driver left the bus on the road and absconded..why?
mictv telugu

ఏపీ: బస్సును రోడ్డుపై వదిలేసి, పరారైన ఆర్టీసీ డ్రైవర్..ఎందుకంటే?

July 13, 2022

 

ఆంధ్రపదేశ్‌లో ఓ ఆర్టీసీ డ్రైవర్ అర్థరాత్రి ప్రయాణంలో ఉన్న బస్సును రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. దాంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం చేయాలో తెలియక అయోమాయంలో పడ్డారు. డ్రైవర్ వస్తాడేమోనని గంటల కొద్దీ ఎదురుచూసి, చివరికి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వెంటనే మరో డ్రైవర్‌ను పంపించి, ప్రయాణికులకు ఊరట కల్గించారు. మరి ఎందుకు ఆ డ్రైవర్ పరారైడు? అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే..

కడప జిల్లా డిపో నుంచి బెంగుళూరుకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సోమవారం రాత్రి 11 గంటలకు 35 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బస్సు డ్రైవర్ ర్యాష్‌గా డ్రైవింగ్ చేయటం మొదలుపెట్టాడు. దాంతో ప్రయాణికులు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురై, ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్లి పలువురు ప్రయాణికులు మందలించారు. ఇక అంతే, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ సమీపం దగ్గరికి రాగానే, బస్సును రోడ్డుపైనే వదిలేసి, ఆ డ్రైవర్ పరారయ్యాడు. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతూ, డ్రైవర్ కోసం గంటల కొద్ది వేచి చూశారు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మరో డ్రైవర్‌ను పంపడంతో ప్రయాణికులు గమ్యస్థానం చేరుకున్నారు.

అనంతరం ప్రయాణికుల ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. ఆ డ్రైవర్ ఎందుకిలా చేశాడో తెలుసుకుంటామని, అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ కోసం అధికారులు గాలిస్తున్నారు.