AP to promote 8 thousand SGTs as school assistants
mictv telugu

ఎస్జీటీలకు గుడ్ న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ ఓకే

August 6, 2022

ఏపీలోని విద్యాశాఖ ఎస్జీటీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 3 నుంచి 10 వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో టీచర్ల నియామకాల కోసం 8 వేలకు పైగా పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించనుంది. అలాగే 3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు ఉన్న ప్రిహైస్కూళ్లలో విద్యార్ధులు నిర్ణీత సంఖ్యకు మించి ఉంటే వాటిలోనూ సబ్జెక్టు టీచర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించనున్నారు. అదికాక, ప్రిహైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల కోసం 1000 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను గ్రేడ్ 2 హెచ్ ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. సీనియారిటీ ఆధారంగా ఇచ్చే ఈ ప్రమోషన్లకు ఉండాల్సిన విధివిధానాలను విద్యాశాఖ జాయింట్ కమిషనర్ శుక్రవారం సర్క్యులర్ రూపంలో విడుదల చేశారు. ఇందులో జిల్లాల వారీగా పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాను ఈ నెల 10వ తేదీలోగా రూపొందించాలని ఆదేశించారు. ఎలాంటి న్యాయవివాదాలకు తావు లేకుండా ఏకరూప నిబంధనలు అనుసరించాలని స్పష్టంగా పేర్కొన్నారు.