AP top in business ranks .. Telangana in fourth place
mictv telugu

బిజినెస్ ర్యాంకుల్లో ఏపీ టాప్.. నాల్గో ప్లేసులో తెలంగాణ

June 30, 2022

సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం మరోసారి తన సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం నాల్గో స్థానంలో నిలిచింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు రెండో స్థానం దక్కింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020లో భాగంగా టాప్ అచీవర్స్ – 7 జాబితాను ప్రకటించారు. మొత్తం 10,200 మంది పెట్టుబడి దారులు, స్టాక్ హోల్డర్స్ నుంచి అభిప్రాయాలను సేకరించగా, అన్ని రంగాల్లోనూ మెరుగైన పనితీరు కనపరిచిన ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పాయింట్ల పరంగా చూస్తే.. ఏపీ 97.89, గుజరాత్ 97.77, తమిళనాడు 96.97, తెలంగాణ 94.86 శాతం వచ్చాయి. ఇదిలా ఉండగా, 2019 – 2021 వరకు ఏపీకి 451 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. గుజరాత్ తర్వాత దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం ఉండడం, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడం ఏపీకి కలిసొచ్చిందని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది.