దేశంలోని రైతుల రుణభారంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని ప్రతీ రైతు కుటుంబంపై రూ. 2,45,554 అప్పు ఉందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. దేశంలో రైతుల అప్పులపై పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో పతి రైతు కుటుంబం మీద రూ.74, 121 కోట్ల రుణం ఉండగా, ఏపీ రైతులకు అంతకు మూడు రెట్టు ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపారు. ఐదో స్థానంలో తెలంగాణ ఉంది.తెలంగాణ రైతు కుటుంబపై రూ.1,52,113 మేర అప్పు ఉన్నట్లు నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు. తెలంగాణ రైతుల మీద కూడా జాతీయ సగటుకంటే రెండు రెట్ల అప్పు ఎక్కువగానే ఉంది.
అతి పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట సహా అనేక రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో రైతుల మీద అప్పులు ఉన్నాయి. రైతులపై రుణభారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా రూ.6 వేలు అందిస్తున్నట్లు తెలిపారు.అయితే 2008-09 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణమాఫీ చేయలేదని స్పష్టం చేశారు.