ఏపీకి భారీ వర్ష సూచన.. వర్షాలు పడే రోజులు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి భారీ వర్ష సూచన.. వర్షాలు పడే రోజులు ఇవే

November 1, 2022

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా నెల్లూరు, చిత్తూరులో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్నమయ్య , బాపట్ల , ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. రాయలసీమకు వరద నీటి ముప్పు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా, వాతావరణ కేంద్రం ఆ విషయాన్ని స్పష్టం చేసింది.

నెల్లూరు, సూళ్లూరుపేట, కృష్ణపట్నం, చెన్నైకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 3, 4 తేదీలలో సాధారణ వర్షాలున్నాయి. ప్రకాశం, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల తూర్పు ప్రాంతాల్లో, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.