అయోధ్యపై కంగనా రనౌత్ సినిమా - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్యపై కంగనా రనౌత్ సినిమా

November 25, 2019

బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ వైవిధ్య చిత్రాలకు పెట్టింది పేరు. ఆమె కెరీర్‌‌లో ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించారు. ఇప్పటికే నటిగా, దర్శకురాలిగా సత్తా చాటిన ఆమె తాజాగా ఓ వైవిధ్యభరిత రామ మందిరం-బాబ్రీ మసీదు కథతో నిర్మాతగా మారబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలి చందేల్ ట్వీటర్‌లో తెలిపారు. ‘అపరాజిత అయోధ్య’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. 

ఈ సినిమాలో నాస్తికుడైన ఓ వ్య్తకి ఎలా భక్తుడిగా మారాడు అనే విషయాన్ని చెప్పబోతున్నారట. త్వరలోనే దర్శకుడు, నటీనటుల గురించి ప్రకటన వస్తుందని సమాచారం. అయోధ్య వివాదంపై 134 సంవత్సరాలుగా వివాదం నడిచింది. కాగా, దీనిపై నవంబర్ 9వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. వివాదానికి తెరపడటంతో ఇప్పుడు అక్కడ రామ్ మందిర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. కంగనా చివరిసారిగా రాజ్‌కుమార్‌ రావుతో ఏక్తాకపూర్‌ నిర్మించిన జడ్జిమెంటల్‌ హై క్యా మూవీతో ప్రేక్షకులను పలకరించారు. మరోవైపు జయలలిత బయోపిక్‌ తలైవిలో ఆమె నటిస్తున్నారు. తలైవిగా కంగనా ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.