‘వారానికి ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించి నేతన్నకు చేయూతను ఇద్దాం’ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంటున్న విషయం తెలిసిందే. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాము కాస్త అప్డేట్ అయితే కొంతలో కొంతైనా మేలు జరుగుతుందని ఆప్కో భావించింది. ఈ నేపథ్యంలో ఆప్కో, అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆన్లైన్లో ఆప్కో వస్త్రాల కొనుగోలును ప్రారంభించారు.
మంగళవారం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై ఆప్కో, అమెజాన్ సంస్థలు కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. అమెజాన్ సహాయంతో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతుంది అని అన్నారు. ఆప్కో నుంచి 104 రకాల చేనేత ఉత్పత్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు.