Apollo and Basavatharakam Hospitals.. should provide free treatment
mictv telugu

అపోలో, బసవతారకం ఆస్పత్రులు..ఫ్రీగా వైద్యం అందించాలి

July 27, 2022

హైదరాబాద్‌లో ఉన్న అపోలో ఆసుపత్రి, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రులు ఉచితంగా ఇన్‌ పేషంట్, ఔట్‌ పేషంట్‌ సేవలు అందించాలని కేసీఆర్ సర్కార్ ఓ జీవో పత్రాన్ని తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది. ఆ జీవోలో.. డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ కూడా ఉంటుందని పేర్కొంది.

గతంలో ఓమిమ్‌ మానెక్షా డెబారా.. తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర సర్కార్‌ నుంచి తక్కువ ధరలకు భూమి తీసుకున్న టైంలో జరిగిన ఎంవోయూల ప్రకారం..ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు పేదలకు ఉచితంగా వైద్యం అందజేయాలని, కనీసం కరోనా కష్టకాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ దాఖల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.

”ఎంఓయూల ప్రకారం రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి, వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారు. జరిమానా విధింపు అవకాశం కూడా ఉంది. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్‌ పేదలకు ఉచితంగా కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యింది. ఇక, బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు, రోజూ 40% ఔట్‌పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యింది. ఇవి అమలు చేసే విధానాన్ని వివరిస్తూ, ఈ నెల 16న రాష్ట్ర సర్కార్‌ మరో జీవో 80 జారీ చేసింది’అని ఏజీ వివరించారు. అనంతరం విచారణను ఆగస్టు 8కి వాయిదా వేశారు.

ఆ జీవోలో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇవే..
1. అపోలో, బసవతారకం ఆస్పత్రులు 15%, 25% పడకలను పేదల కోసం కేటాయించాలి.
2. ఇది దాతృత్వం కాదు. ఇది వారి కర్తవ్యం.
3. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం ప్రభుత్వం తక్కువ ధరకు ఇచ్చింది.
4. ప్రధాన మంత్రి జీవన్‌ ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి.
5. బసవతారకం 40% పేదలకు తప్పకుండా ఓపీ సేవలు ఉచితంగా అందించాలి.
6. ఇవన్నీ సరిగా అమలవుతున్నాయా లేదా అన్నది డీఎంహెచ్‌ఓ అప్పుడప్పుడు పరిశీలించి ధ్రువీకరించాలి.
7. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రత కార్డుదారులు ఉచిత ఓపీకి అర్హులు.