పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్న అప్పిరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్న అప్పిరెడ్డి

February 17, 2018

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అన్నారు పెద్దలు. మాతృభూమి గొప్పతనం మాటలకు అందనిది. మనకు తల్లి జన్మనిస్తే నేలతల్లి తనపై పండే పంటలు, పళ్లతో, ప్రవహించే జలధారలతో మన ఆకలిదాహాలు తీర్చి ఒక పరిపూర్ణ మనిషిని రూపొందిస్తుంది. నిస్సార్థమైన మాతృభూమి రుణం మనం ఏమిచ్చినా తీరదు. కానీ ప్రయత్న లోపం లేకుండా కృషి చేయాలి. మాతృభూమి రుణం తీర్చుకోవడం అంటే అక్కడి ప్రజలకు సేవ చేయడమే. భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించడానికి ఉడతాభక్తితో సాయం చేయడమే.

దొండపాడు గ్రామంలో శనివారం ఏహెచ్ఆర్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న సూర్యాపేట జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి. చిత్రంలో ఫౌండేషన్ అధినేత అప్పిరెడ్డి తదితరులు

ఏహెచ్‌ఆర్ ఫౌండేషన్, మైక్ టీవీల అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి మాతృభూమి రుణాన్ని అలా తీర్చుకుంటున్నారు. తన పుట్టిన ఊరైన సూర్యాపేట జిల్లా దొండపాడు ప్రజలకు, విద్యార్థులకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తను స్థాపించిన ఆదెమ్మ, హుస్సేన్ రెడ్డి(ఏహెచ్‌ఆర్) ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారు. శనివారం ఈ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవాన్ని దొండపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ‘పుట్టిన ఊరికి సేవ చేయడం ఆదర్శం మాత్రమే కాదు, ఒక బాధ్యత కూడా. కేవలం తను మాత్రమే పైకివస్తే చాలని సరిపెట్టుకోకుండా తోటివారి అభివృద్ధికి కూడా చేయూత నివ్వాలి. అప్పిరెడ్డిగారు అదే చేస్తున్నారు. ఇందుకు ఆయనను నేను మనసారా అభినందిస్తున్నాను. విద్యార్థులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి…’ అని పిలుపునిచ్చారు. సామాజిక సేవాకార్యక్రమాలకే పరిమితం కాకుండా అప్పిరెడ్డిగారు సాంస్కృతిక రంగానికి కూడా తనవంతు దోహదం చేస్తున్నారని, మైక్ టీవీ ద్వారా తెలంగాణ సంస్కృతిని, కళారూపాలను ప్రచారంలోకి తీసుకొస్తున్నారని ప్రశంసించారు.  

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి

కార్యక్రమంలో అప్పిరెడ్డి, అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అన్నపరెడ్డి అక్కమ్మ, టీటా అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తల, ఉపాధ్యక్షుడు రాణాప్రతాప్ బొజ్జం, అధికార ప్రతినిధి వెంకట వనం తదితరులు పాల్గొన్నారు.