చైనాకు కరోనా దెబ్బ..ఇండియాకు 20 శాతం ఆపిల్! - Telugu News - Mic tv
mictv telugu

చైనాకు కరోనా దెబ్బ..ఇండియాకు 20 శాతం ఆపిల్!

May 11, 2020

కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉన్న పరిశ్రమలు దాదాపు మూడు నెలల పాటు మూతపడ్డాయి. దీంతో ఎన్నో దిగ్గజ కంపెనీలు నష్టాలను చవిచూశాయి. వాటిలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆపిల్ సంస్థ ఒకటి. కరోనాతో ఏర్పడ్డ నష్టాలను అధిగమించాలని ఆపిల్ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తన ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 20శాతంను చైనా నుండి భారతదేశానికి తరలించాలని ఆపిల్ భావిస్తోంది. దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ కొత్త ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను అందుబాటులకి తెచ్చింది. ఈ ప్రయోజనాలను పొందాలని ఆపిల్‌ భావిస్తోందని సమాచారం.

ఈ మేరకు గత కొన్ని నెలలుగా ఆపిల్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య పలు సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం, ఆపిల్ తన స్మార్ట్‌ఫోన్‌లు ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి కోసం తయారీదారులైన ఫాక్స్‌ కాన్, విస్ట్రాన్‌లను ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంట్రాక్టర్ల ద్వారానే భారతదేశంలో 40 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. అలాగే 2021 కల్లా భారత్ లో మొట్టమొదటి ఆపిల్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాలని ఆపిల్ భావిస్తోంది.