Apples Farmers Threat To BJP Govt
mictv telugu

బీజేపీకి యాపిల్స్ ఝలక్..!

November 7, 2022

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీని యాపిల్స్ కలపెడుతున్నాయి. 30 ఏళ్ల కిందటి సీన్ రిపీట్ అవుతుందేమోనని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. యాపిల్స్ రైతుల ఆగ్రహాన్ని కాంగ్రెస్ , ఆప్‌లు అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కుతుందా? యాపిల్స్ రైతుల ఆగ్రహాన్ని ఎలా చల్లార్చబోతోంది?

యాపిల్ రైతుల చేతిలో 25 సీట్లు

హిమాచల్ ప్రదేశ్ యాపిల్స్‌కు స్వర్గధామం. ప్రతి ఏడాది 5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. రాష్ట్ర ఆదాయంలో 13.5శాతం వాటా. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 సీట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 25 సీట్ల వరకు యాపిల్స్ రైతులు ప్రభావం చూపుతారు. వీళ్లు మొగ్గుచూపిన పార్టీదే విజయం. గెలుపు ఓటములతో శాసించే స్థాయిలో ఈ రైతులు ఉన్నారు.

మూడు పార్టీల టార్గెట్ వీళ్లే

హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపు యాపిల్స్ రైతుల చేతుల్లోనే ఉంది. అందుకే మూడుపార్టీలు వీరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీరి సమస్యల్నే అస్త్రాలుగా విపక్షాలు మలుచుకుంటున్నాయి. అధికారిక బీజేపీ ప్రభుత్వం వీరిని డిమాండ్లను ఎప్పటికప్పుడు తీర్చేస్తూ వస్తుంది. కానీ ఈసారి కమలం నేతలపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. పురుగుమందులు, అట్టపెట్టెలపై 18 శాతం జీఎస్టీ వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈసారి తమ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని యాపిల్ రైతులు హెచ్చరిస్తున్నారు. అసలే సాగువ్యయం పెరిగిన రైతులకు జీఎస్టీ మరింత భారంగా మారింది. మార్కెట్ పై కార్పొరేట్ శక్తుల గుత్తాదిపత్యం రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో మళ్లీ యాపిల్స్ రైతులు ఆందోళన బాటపట్టారు.

30 ఏళ్ల కిందట

సరిగ్గా 30 ఏళ్ల కిందట యాపిల్స్ రైతులు ఆందోళనకు దిగారు. అప్పట్లో బీజేపీ ప్రభుత్వంపై పెద్దయెత్తున నిరసనలు తెలిపారు. పోలీస్ కాల్పుల్లో ముగ్గురు రైతులు చనిపోయారు. ఈ కోపాన్ని అంతా రైతులు ఎన్నికల్లో చూపారు. బీజేపీని విసిరి అవతల కొట్టారు. 1990లో శాంతాకుమార్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దించేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 60 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. అధికారంలోకి రాగానే నాటి వీరభద్రసింగ్ ప్రభుత్వ రైతుల డిమాండ్లు అన్నీ తీర్చింది.

మళ్లీ ఇప్పుడు ఆందోళన

30 ఏళ్ల తర్వాత మళ్లీ యాపిల్ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. జీఎస్టీ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని రైతుల్ని విపక్షాలు రెచ్చగొడుతున్నాయని బీజేపీ అంటోంది. పెరిగిన జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం జైరాం ఠాకుర్ హామీ ఇస్తున్నారు. అయినా విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. జీఎస్టీ పరిహారాన్ని ప్రభుత్వం నుంచి రీఫండ్ చేసుకోవడం నిరాక్షరాస్యులపై రైతులకు సాధ్యం కాదని కాంగ్రెస్ , ఆప్ అంటున్నాయి. యాపిల్ రైతుల ఆగ్రహాన్ని బీజేపీ ఎలా చల్లారిస్తుందో ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నికల్ని నుంచి బీజేపీ బయటపడుతుందో లేదో చూడాలి