Applicants who are delaying the passport process through their own mistakes
mictv telugu

ముందే చెక్ చేసుకోండి.. చిన్న మిస్టేక్ చేసినా పాస్‌పోర్ట్ రాదు..

November 9, 2022

విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు.. స్వీయ తప్పిదాలతో పాస్‌పోర్టు ప్రక్రియను ఆలస్యం చేసుకుంటున్నారు. ఫలితంగా మరో కొత్త స్లాట్ బుక్ చేసుకునే లోపు, విదేశాలకు వెళ్లే సమయం దగ్గర పడుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది విద్యార్థులు పాస్‌పోర్టుకు అప్లై చేసే ముందు.. ఏఆర్‌ఎన్‌ (అప్లికేషన్‌ రిఫరెన్స్‌ నంబర్‌) షీట్‌లో ఉన్న డాక్యుమెంట్ అడ్వైజరీని పరిశీలించకపోవడంతోనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని పాస్‌పోర్టు సేవాకేంద్రాల అధికారులు సూచిస్తున్నారు.

అభ్యర్థులు.. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసే ముందే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డులోని పేరు, టెన్త్ క్లాస్ సర్టిఫికేట్‌లోని పేరు ఒకేలా ఉండాలని సూచిస్తున్నారు. అదే విధంగా ఆధార్ కార్డ్ ఎప్పుడో చిన్నప్పటి ఫోటో అయినా, అస్పష్టంగా ఉన్నా.. మరో తేదీకి వాయిదా వేస్తామని చెబుతున్నారు. ఈలోపు ఆధార్ కార్డులో ఫోటోతో పాటు, అడ్రస్ వివరాలను కూడా అప్డేట్ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా బర్త్ సర్టిఫికెట్, ఎడ్యూకేషన్ సర్టిఫికెట్‌లలో ఇంటి పేర్లు.. అటు ఇటు అయినా తిరస్కరణకు గురికాక తప్పదన్నారు.

ప్రతీ రోజు పదులు పదుల సంఖ్యలో దరఖాస్తుదారులు ఇలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వీరందరికీ మరోసారి అనువైన సమయంలో అధికారులు స్లాట్‌ కల్పిస్తున్నా అత్యవసరమైనవారు కాస్త ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రోజూ నిజామాబాద్‌, కరీంనగర్‌, బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలిచౌకి పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాల్లో 4,500కుపైగా పాస్‌పోర్టులు జారీ అవుతున్నాయి. తత్కాల్‌లో బుక్‌ చేసుకున్నవారైతే ఏవైనా మూడు ధ్రువపత్రాలు సమర్పిస్తే చాలు. అయితే అన్నిట్లో వివరాలు ఒకేలా ఉన్నాయో.. లేదో.. ముందే చెక్ చేసుకోవాలి.