కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు మహిళల అభ్యున్నతి కోసం తోడ్పడుతున్నాయి. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మహిళల కూడా ఆర్ధికంగా ఎదగాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. మహిళలకు సంబంధించి మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలలో పీఎం ఉచిత కుట్టు మిషన్ పథకం ఒకటి. ఈ పథకం కింద మహిళలను నిపుణులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఆదాయ వనరులను పెంచనున్నారు.
కుట్టు, ఎంబ్రాయిడరీలో ఆసక్తి ఉన్న మహిళల కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం ద్వారా ప్రతి రాష్ట్రంలో 50,000 మందికి పైగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందిస్తోంది. 20 నుంచి 40 ఏళ్లలోపు మహిళలు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేయబోయే మహిళలకు ఆధార్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండటం తప్పనిసరి. ఒకవేళ వికలాంగులైతే నిర్దిష్ట వైకల్య ధృవీకరణ పత్రం, వితంతువులకు వితంతు సర్టిఫికేట్ అవసరం ఉంటుంది.
ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి..
• పీఎం ఉచిత కుట్టు మిషన్ పథకం ప్రయోజనాన్ని పొందడానికి, ముందుగా అధికారిక వెబ్సైట్ www.india.gov.in లోకి వెళ్లాలి.
• హోమ్‌పేజీలో ఎంపిక లింక్‌పై క్లిక్ చేయండి.
• అప్లికేషన్ ఫార్మాట్ ప్రింటవుట్ తీసుకోండి.
• ఈ అప్లికేషన్లో అడిగిన అవసరమైన సమాచారాన్ని పూరించండి.
• మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌తో అవసరమైన పత్రాలను జోడించి, సంబంధిత కార్యాలయానికి సమర్పించండి.
• కార్యాలయ అధికారులు దరఖాస్తు ఫారాన్ని పరిశీలిస్తారు.తరువాత అర్హులకు ఉచితంగా కుట్టు మిషన్‌ను అందజేస్తారు.