ఏపీ అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం రూ.55వేల కోట్లు దాటింది. ఈ విషయం మరోసారి పార్లమెంట్ వేదికగా బయటపడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లు ఉన్నట్లు కేంద్రం తెలిపింది .రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2019లో రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా, 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022లో రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకరం ప్రస్తుత ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉన్నటు తెలిపారు. 2019 పోలీస్తే ఏపీ అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయి. ఏటా సుమారు రూ.45 వేల కోట్లు అప్పులు చేస్తోంది. భారీగా అప్పుల నేపథ్యంలో వైసీపీ సర్కార్‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వానికి భారతరత్న మాదిరిగా అప్పు రత్న అవార్డు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.