జనవరిలో రానున్న సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలు పెద్ద ఎత్తున సొంతూళ్లకు పయనమవుతారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పటినుంచే చర్యలు ప్రారంభించింది. జనవరి 6 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలిపింది. ఇందుకోసం 6,400 బస్సులను సిద్ధం చేసినట్టు ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. దీంతో పాటు రెండు గుడ్ న్యూస్ లను అందించారు. మొదటిది ఈ స్పెషల్ బస్సులలో సాధారణ ఛార్జీలే ఉంటాయి. ముందుగా రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు.
రెండోది రాను పోను టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ ధరలో పది శాతం రాయితీ పొందవచ్చని ఎండీ తెలియజేశారు. ఇక సంస్థ, దాని ఉద్యోగుల గురించి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా తొలగించే ఆలోచన లేదని, అలవెన్సుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అటు ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లంచే ప్రతిపాదన ఏదీ లేదన్నారు.