ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చోరీ.. ఇంకేమీ దొరకలేదా బాబూ..
ఆర్టీసీ బస్సుల్లో జేబులు కత్తిరించే పిక్ పాకిటర్ దొంగలను చూశాం. బస్సుల్లో పర్సులు కొట్టేసి, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారినీ చూశాం. అయితే ఈ దొంగ ఆ దొంగల కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్టున్నాడు. అందుకే ఊరికే జేబులేం కత్తిరిస్తాం.. బస్సునే దొంగిలిస్తే పోలా అనుకున్నట్టున్నాడు.. ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. అందుకే ఈ దొంగను మామూలు అనలేం.. రొటీన్‌కు భిన్నమైన దొంగ అనాలి. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో చోటుచేసుకుంది.
ధర్మవరం ఆర్టీసీ బస్ స్టాండ్‌లో శుక్రవారం ఓ బస్సును సిబ్బంది మరమ్మత్తు చేశారు. అనంతరం వారు భోజనానికి వెళ్లిపోయారు. అదే అదునుగా భావించిన ఓ దొంగ మరమ్మత్తు చేయబడ్డ ఏపీ02జెడ్552 బస్సును దొంగిలించాడు. బస్సును స్వయంగా డ్రైవ్ చేసుకుని వేగంగా అక్కడినుంచి ఉడాయించాడు. కాసేపయ్యాక బస్సు దొంగతనానికి గురైందని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కియా ఫ్యాక్టరీ వద్ద బస్సుతో సహా దొంగను అరెస్ట్ చేశారు. అతన్ని కర్ణాటకకు చెందిన దొంగగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.