ఏపీఎస్ ఆర్టీసీ సంచలన నిర్ణయం..దేశంలోనే తొలిసారి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీఎస్ ఆర్టీసీ సంచలన నిర్ణయం..దేశంలోనే తొలిసారి

June 1, 2022

ఏపీఎస్ ఆర్టీసీ ఓ సంచలన ప్రకటన చేసింది. దేశంలోనే ఏ రాష్ట్రం ప్రభుత్వం తీసుకొని, తొలి నిర్ణయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ తీసుకుంది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకురావాలని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఈ-పోస్ మిషన్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) స్థానంలో ఈ-పోస్ మిషన్లను తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మొదటగా విజయవాడ, గుంటూరు-2 డిపోలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సూచించారు. ఇప్పటికే ఈ-పోస్ మిషన్లను తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో గత మూడు రోజులుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల స్పందనను బట్టి దశల వారీగా మిగతా బస్సుల్లోనూ వీటిని అమలు చేయాలని, మిషన్ల ఉపయోగంపై కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు.

‘ఇక్సిగో-అభిబస్ సంస్థ ఈ యంత్రాలను తయారు చేసింది. 50 ఈ-పోస్ మిషన్లను అందించింది. త్వరలోనే మరిన్ని అందించనుంది. ఈ మిషన్ల ద్వారా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు (ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్) ద్వారా టికెట్ ధర చెల్లించుకోవచ్చు. నగదు చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ మిషన్ల ద్వారా చిల్లర సమస్యకు ఫుల్‌స్టాప్ పడుతుంది. మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్ల ఖాళీలను బట్టి ‘స్టేజ్ టు టికెట్’ ఇష్యూ అవకాశం కూడా కల్పించారు. బస్సు రూట్‌ ట్రాకింగ్‌ను యాప్‌లో చూసుకోవచ్చు. ఈ-పోస్ మిషన్‌లోని సిమ్‌కార్డు నెట్‌వర్క్ పనిచేయకుంటే ఉపయోగించుకునేలా ‘టిమ్’ కూడా అందుబాటులో ఉంటుంది. సాధారణ టికెట్లతో పాటు సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, జర్నలిస్టులకు కూడా రాయితీలు యథావిధిగానే లభిస్తాయి.’