APSRTC arranged special buses for Dussehra
mictv telugu

ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ బస్సుల్లో ప్రత్యేక చార్జీలుండవు

September 19, 2022

దసరా పండుగ రానున్న నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జీవనోపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా పండుగకు సొంతూళ్లకు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 1081 అదనపు సర్వీసులను నడపనున్నట్టు ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ స్పెషల్ సర్వీసులు కొనసాగనుండగా, ఆ బస్సులు జాబితాను సోమవారం సాయంత్రం అధికారిక వెబ్‌సైట్లో విడుదల చేసింది. వాటిలో రిజర్వేషన్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, చార్జీల విషయంలో ఉపశమనం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు బాదుడు పేరిట 50 శాతం అధిక ఛార్జీలను వసూలు చేసే సాంప్రదాయానికి వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపింది. ఈ బస్సులు విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, అమలాపురం, భద్రాచలం మధ్య నడవనున్నాయి.