బస్ మైలేజీ తగ్గితే ఆర్టీసీ డ్రైవర్ల జీతాల నుంచి రికవరీ చేస్తామని ఏపీలోని కొన్ని జిల్లాల్లోని డిపో మేనేజర్లు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు అవసరం కంటే ఎక్కువ డీజిల్ వాడినా.. ఆ ఖర్చును కూడా వారి జీతంలోనే కట్ చేస్తామని చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై డ్రైవర్లు మండిపడుతున్నారు. మైలేజ్ రావట్లేదంటే అందుకు గల కారణాలేంటో తెలుసుకోవాలి కానీ.. తమ జీతాల నుంచి రికవరీ చేస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాలం చెల్లిన బస్సులు.. గుంతల రోడ్లు ఉండగా వీటితో మైలేజీ ఎలా సాధ్యమని చెబుతున్నా.. డిపోల్లో పట్టించుకోకుండా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం నగర పరిధిలోని సింహాచలం, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి డిపోనకు చెందిన కొందరు డ్రైవర్లకు ఇటువంటి తాఖీదులు ఇచ్చినట్లు బయటపడింది. లీటర్కు 6 కి.మీ.లు రావాల్సిన మైలేజీ 5.16 కి.మీ. వచ్చిందని, 115 లీటర్ల డీజిల్ అదనంగా ఖర్చు అయిందని, మొత్తం రూ.12,075 నష్టం వచ్చినట్లు లెక్కించి వారికి (ఆ డ్రైవర్లకి) నోటీసులు ఇచ్చారు.