ఏపీఎస్ ఆర్టీసీ కొత్త యాప్..ఆన్‌లైన్ బుకింగ్స్ బంద్! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీఎస్ ఆర్టీసీ కొత్త యాప్..ఆన్‌లైన్ బుకింగ్స్ బంద్!

June 30, 2020

Apsrtc developing new application for online booking

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్టీసీ) టిక్కెట్ల విషయంలో పలు కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ వ్యవస్థను ఆధునీకరిస్తోంది. ఇకపై అన్ని బస్సుల్లో రిజర్వేషన్‌ టికెట్‌ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. నగదు రహిత, కాంటాక్ట్‌ లెస్‌ టికెటింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఈ సన్నాహాలు చేస్తోంది.

అన్ని రకాల బస్సు సర్వీసులకు టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు ‘ప్రథమ్’ పేరుతో ఓ మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తెస్తోంది. పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఈ యాప్‌నే వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్‌లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది యాప్‌ చూపిస్తుంది. అలా బస్సును ఎంపిక చేసుకుని టికెట్ కొనుగోలు చేయవచ్చు. నగదు చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ జారీ అయినట్లు మెసేజ్‌తో పాటు 4 అంకెల పిన్ నంబర్ వస్తుంది. ప్రయాణికుడు బస్సు ఎక్కే సమయంలో డ్రైవర్‌కు పిన్ నంబర్ చెబితే సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ యాప్ ను డెవలప్ చేయడానికి ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ బుకింగ్స్ ను నిలిపేసింది.