సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యాయి ఆయా సంస్థలు. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ కూడా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 6,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రత్యేక బస్సులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 6 నుంచి 14 వరకు(3,120 బస్సులు), జనవరి 16 నుంచి 19వ తేదీ వరకు(3,280 బస్సులు) ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. అన్ని బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
పండుగ వేళ రద్దీ దృష్ట్యా గతేడాది ఆర్టీసీ అధికారులు.. స్పెషల్ బస్సుల టికెట్ ధరను 50 శాతం వరకు పెంచారు. కానీ ఈసారి మాత్రం చార్జీలు పెంచకపోగా స్పెషల్ డిస్కౌంట్లో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. లేదంటే జనాలు ‘ప్రైవేటు’ వాహనాల్లో ప్రయాణిస్తారని, తద్వారా తమకే నష్టం చేకూరుతుందనే భావనతో పెద్ద ప్లానే వేశారు. స్పెషల్ బస్సుల్లో 5 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. రానుపోను ఒకేసారి రిజర్వు చేయించుకుంటే 10 శాతం, నలుగురికి మించి కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి ప్రయాణిస్తే 5 శాతం రాయితీ ఇస్తోంది. అలాగే, వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే 5 శాతం, వృద్ధుల చార్జీల్లో 25 శాతం తగ్గింపు ప్రకటించింది.
ఆర్టీసీ యాప్, వెబ్సైట్, అధికారిక ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ చేయించుకుని ప్రకటించిన రాయితీలు పొందొచ్చని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తదితర వివరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ను సంప్రదించొచ్చు.