తిరుమలలో అన్యమత ప్రచారం.. అధికారిపై వేటు
తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసి బస్సు టికెట్‌పై జెరూసలెం యాత్రకు సంబంధించిన ప్రకటనపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దు బాటు చర్యలు చేపట్టారు. అన్యమతానికి సంబంధించిన ప్రకటన తిరుమల బస్సులోకి ఎలా వచ్చిందనే అంశంపై విచారణ చేపట్టారు. అనంతరం దీనికి కారణమైన స్టోర్ కంట్రోలర్ అధికారిని సస్పెండ్ చేశారు.
నెల్లూరులో ఆర్టీసీ స్టోర్స్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న జగదీష్ బాబుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. టికెట్ రోల్స్‌ను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నందున అతన్ని విధుల నుంచి తప్పించినట్టు అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని డిపోలకు మాత్రమే వినియోగించాల్సిన ఆ బస్ టికెట్లను తిరుమల తిరుపతి డిపోలకు సరఫరా చేయడం వెనుక జగదీశ్ బాబు హస్తం ఉన్నట్లు తేలిందని ఆర్టీసీ అధికారులు నిర్ధారించారు. జగదీష్ బాబు అనాలోచిత నిర్ణయం వల్ల తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నారని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు.