కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. అయితే, ఈ సమయంలో.. ఏపీఎస్ఆర్టీసీ, తిరుపతి విభాగం ఓ నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే 10 రోజులపాటు దర్శన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వెంకన్న భక్తులు మండిపడ్డారు. అసలు, శ్రీవారి దర్శనానికి, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు.
వచ్చే 10 రోజులు టోకెన్లు ఉంటేనే బస్సుల్లోకి భక్తులను అనుమతి ఇస్తామన్న ఈ నిర్ణయం భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ వెనక్కి తగ్గింది. చివరకు తన నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకోక తప్పలేదు. భక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. వైకుంఠ ద్వారం తెరిచే పది రోజులు దర్శన టోకెన్లతో సంబంధం లేకుండా యధావిధిగా ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి భక్తులు తమ ప్రయాణాలు చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యల్లో తరలివచ్చే అవకాశం ఉండడంతో.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని. సిఫార్సు లేఖలు అనుమతించడం లేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.. ఇదే సమయంలో.. టికెట్లు, టోకెన్లు ఉంటేనే తిరుమలకు రావాలని స్పష్టం చేశారు. ఈ తరుణంలో.. ఆర్టీసీ నిర్ణయం వివాదాస్పదం అయింది.