AR Rahman Birthday 2023: Here are some unknown facts about the music maestro
mictv telugu

దటీజ్ ఏఆర్ రెహ్మాన్.. దట్స్ వై సలామ్ రెహ్మాన్

January 6, 2023

 

ఏఆర్ రెహమాన్.. అసలెవరీ రెహ్మాన్? 1992 కు ముందు ప్రపంచానికి అస్సలు పరిచయం లేని పేరు. ఏవో జింగిల్స్ చేసుకుంటూ, కీ బోర్డ్ వాయించుకునే ఓ సాదా సీదా పాతికేళ్ల కుర్రాడు. కానీ మణిరత్నం అనే ఓ క్రియేటివ్ మూవీమేకర్ కంటపడ్డాడు. తన ఎక్స్‌పెరిమెంటల్ మ్యూజిక్‌తో ఆయన చెవినపడ్డాడు. దాంతో మణిరత్నం ఆ కుర్రాణ్ని వెతుక్కుంటూ స్టూడియోకెళ్లాడు. అప్పటికి తను వర్క్ చేసిన ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల స్టూడియో సెటప్‌లో పదోవంతు కూడా లేదా స్టూడియో. అయినా టాలెంట్ మీద నమ్మకంతో మణిరత్నం ఆయన కొత్త మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే అని చెప్పేశాడు. ఆ కుర్రాడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ఓకే అన్నాడు. ఈ మ్యాటర్ తెలిసి ఇండస్ట్రీ అంతా షాక్. మణి సార్‌కి పిచ్చా ఏంటి? ఇళయరాజాలాంటి మ్యాస్ట్రోతో ఇన్నేళ్లూ కలిసి సినిమాలు చేసి మౌనరాగం, నాయకుడు, దళపతి, గీతాంజలి.. లాంటి బ్లాక్ బస్టర్ కాంబోని కాదని ఒక్క మూవీ కూడా చేయని కొత్త పిల్లాడి చేతిలో ప్రాజెక్ట్ పెట్టాడా అని నోరెళ్లబెట్టారు. పాపం.. వాళ్లెవరికీ తెలీదు కదా మరి. కొన్నేళ్ల తర్వాత అకాడమీ వాళ్లు రెండు ఆస్కార్‌లని ఆ కుర్రాడి చేతిలోనే పెట్టి శభాష్ అంటారని. కట్ చేస్తే.. రోజా క్యాసెట్స్ మార్కెట్ లోకొచ్చాయి. తమిళ్, తెలుగు, హిందీ అన్న తేడా లేదు. భాషతో సంబంధం లేకుండా భారతదేశమంతా ఎవరీ మ్యూజిక్ డైరెక్టర్ అని ఆశ్చర్యపోయింది. ఏంటీ కుర్రాడా? ఈ రేంజులో కంపోజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇతనా? అని నమ్మలేక క్లారిటీ కోసం కళ్లు నులుముకుని మరీ.. మళ్లీ మళ్లీ చెక్ చేసి చూశారు. తీరా మూవీ రిలీజయ్యాక 26 ఏండ్లకే ఫస్ట్ మూవీకే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు. ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ యార్.

టెక్నాలజీ ఒక్కటే మారింది, కానీ…

ఏ ఆర్ రెహ్మాన్. ఫస్ట్ టైమ్ ఈ పేరు ఎప్పుడు విన్నానో గుర్తులేదు కానీ.. ఇది పాట. ఇది పల్లవి, ఇది చరణం, ఇదీ మ్యూజిక్ అని తెలీని ఏజ్ నుంచీ ఆయన సాంగ్స్ ని కొన్ని కోట్ల మందిలానే నేనూ వింటూ పెరిగా. రేడియో, క్యాసెట్, సీడీ, పెన్ డ్రైవ్, స్పోటిఫై.. ఇలా టెక్నాలజీ మారుతుంది. కానీ రెహ్మాన్ మ్యూజిక్ మీద, ఆయన కంపోజిషన్ మీద రెస్పెక్ట్ అండ్ లవ్ మాత్రం అలా ఉండిపోయింది. ఇన్ ఫ్యాక్ట్.. కాలంతో పాటూ ఆయన తన స్టయిల్ నూ మార్చుకుంటూ వచ్చాడు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ సారా దునియాతో సాహో అనిపించుకున్నాడు. అలానే ఆరు నేషనల్ అవార్డులు, ఆరు తమిళనాడు స్టేట్ అవార్డులు, 32 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు రెండు ఆస్కార్ అవార్డుల్ని దక్కించుకుని పద్మశ్రీ, పద్మభూషణ్ వరించినా ఇంకా పసిపిల్లాడిలా నవ్వుతూ అమ్మనే తల్చుకుంటాడు.

హీరోహీరోయిన్లతో పనిలేదు..

ఒకటా రెండా.. ఎన్ని సాంగ్స్ అనీ, ఎన్ని ట్యూన్స్ అనీ, ఎన్ని మెమరీస్ అనీ.. రోజా, బొంబాయి, దొంగా దొంగా, ఇద్దరు, ప్రేమికుడు, ప్రేమదేశం, ప్రేమికులరోజు, ఓకే బంగారం, రిథమ్, యువ, ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, జీన్స్, తాల్, దిల్ సే, భారతీయుడు, బాయ్స్, శివాజీ, గురు, నరసింహా, ఏమాయ చేశావె, సఖి, రంగీలా, మెరుపు కళలు, అమ్రుత,ప్రియురాలు పిలిచె, విలన్.. ఇలా మోస్ట్ ఆఫ్ ఆడియెన్స్ కి తెలిసిన సినిమాల గురించి పక్కకు పెడితే.. చాలా సినిమాల స్టోరీ గుర్తులేదు, హీరో హీరోయిన్ ఎవరన్నది కూడా తెలీదు. ఆ మాటకొస్తే అసలు కొన్ని మూవీల పేర్లు కూడా సరిగ్గా గుర్తులేదు సామీ. కానీ వాటిల్లో రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు గుర్తున్నాయి. కాస్త హమ్ చేసినా పాటంతా మైండ్ లో రివైండయ్యే క్లాసికల్ హిట్సూ ఉన్నాయి.

ఆ పేరుంటే చాలు.. దెబ్బకు తెగాల్సిందే..

డైరెక్టర్ ఎవరు? స్టోరీ ఏంటి? కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనేవేవీ పట్టించుకోకుండా. ఆడియో క్యాసెట్ మీద ఏ ఆర్ రెహమాన్ అన్న పేరుంటే చాలు.. టికెట్లు తెగడం గ్యారంటీ. కొన్నివారాపాటు హౌజ్ ఫుల్లయి ఓపెన్సింగ్ తో వసూళ్లు రావడం పక్కా అనేంతలా మేకర్స్ కి ది బెస్ట్ అండ్ ఫస్ట్ ఛాయిస్ లా మారి ఎన్నో బాక్సాఫీస్ బంపర్ హిట్లకి బ్రాండ్ అంబాసిడరయిన మ్యూజికల్ సెన్సేషన్ రెహమాన్.

ఆ ట్రెండ్ సెట్ చేసింది రెహమానే..

రెహమాన్ సాంగ్స్ ని ఆల్ టైమ్ ఫేవరేట్స్ గా, ఫరెవర్ టాప్ ప్లేసులో ఉంచేలా చేసింది మ్యూజిక్ లో ఆయన చేసిన ఎక్స్ పెరిమెంట్సే. ఓవైపు ట్రెడిషనల్ మ్యూజిక్ కి ప్రయారిటీ ఇస్తూనే, ఇంకోవైపు వెస్టర్న్ వేవ్స్ ని ఒడిసిపట్టుకున్నాడు. సాంప్రదాయ వాయిద్యాల్నీ సరికొత్తగా వాయించడం స్టార్ట్ చేశాడు. వాయిద్యాలంటే గుర్తొచ్చింది. రెహమాన్ ముందు వరకూ క్యాసెట్ వెనకాల ఇంస్ట్రమెంట్స్ వాయించిన ఆర్టిస్టుల పేర్లు వేసేవాళ్లు కాదు. ఆ ట్రెండ్ ని స్టార్ట్ చేసి వాళ్లకీ రెస్పెక్ట్ పెరిగేలా చేసిన కంపోజర్ రెహమానే. ఆయన చేసిన ఫస్ట్ ఆల్బమ్ నుంచీ ఫ్లూటిస్ట్, గిటారిస్ట్, వయెలిన్, డ్రమ్స్, కోరస్ సింగర్స్.. ఇలా ప్రతి ఒక్కరికీ క్రెడిట్స్ ఇచ్చేవాడు. ఫ్లూటిస్ట్ గా నవీన్, డ్రమ్మర్ గా శివమణి లాంటి వాళ్ల పేర్లు కోట్ల మంది జనాలకి అలానే దగ్గరయ్యాయి మరి. ఈ రోజుకీ రిలీజవుతున్న ప్రతీ ఆల్బమ్స్ లో అలా క్రెడిట్స్ ఇచ్చే ట్రెండ్ కంటిన్యూ అవుతోందంటే అది రెహమాన్ చలవే.
దీని వెనక కూడా ఓ స్ట్రాంగ్ రీజన్ లేకపోలేదు. రెహమాన్ వాళ్ల నాన్న ఆర్ కే శేఖర్ మ్యూజిక్ కండక్టర్ కమ్ కంపోజర్. ఇంట్లో అన్నిరకాల మ్యూజిక్ ఇంస్ట్రమెంట్స్, ఇంటికొచ్చిపోయే డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో బిజీగా ఉండేవారాయన. కానీ 1978 లో రెహమాన్ పదకొండేళ్ల వయసులోనే నాన్న చనిపోయాడు. దాంతో ఫ్యామిలీని పోషించడానికి ఇంకో మార్గం తెలీక ఇంట్లో ఉన్న ఇంస్ట్రమెంట్సుని అద్దెకివ్వడం స్టార్ట్ చేశాడు. ఆ వయసులోనే ఆర్కెస్ట్రాలకీ,మ్యూజిక్ బ్యాండ్లకీ, స్టూడియో కంపోజింగ్ సెషన్సుకీ ఇంస్ట్రమెంట్స్ అరేంజ్ చేసేవాడు. స్కూల్ కెళ్లే టైమ్ అంతా ఆ అరేంజ్ కే సరిపోయింది. తెలీకుండానే మ్యూజికే ప్రపంచమైపోయింది. మెల్లి మెల్లిగా ఒక్కో వాయిద్యాన్ని వాయించడం నేర్చుకున్నాడు. ఆల్బమ్స్ కంపోజిషన్ లోనూ కాంట్రిబ్యూట్ చేసేవాడు. కానీ ఎంత చేసినా తన పేరు మాత్రం ఏ ఆల్బమ్ లోనూ, క్రెడిట్స్ లోనూ కనబల్లేదు. ఆ రోజుల్లో అలా ఫీలయ్యే వాడు, ఆర్కెస్ట్రాలో అందరి కష్టం తెలిసిన వాడూ కాబట్టే అందరికీ క్రెడిట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు.

పదమూడేళ్లకే సొంత బ్యాండ్

కానీ ఆ రోజలా ఇంస్ట్రమెంట్స్ అరేంజ్ చేసే స్టేజ్ నుంచీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యేవరకూ జరిగిన ప్రాసెస్ మాత్రం అంత సింపులేం కాదు బాసూ. ఆ రోజుల్లో అలా అద్దెకిస్తూ కష్టపడుతుండడం చూసి రెహమాన్ అమ్మ ఓ సలహా ఇచ్చింది. ఇలా వాళ్లకీ వీళ్లకీ ఇవ్వడం కంటే నీకున్న టాలెంటుతో నువ్వే మ్యూజిక్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయకూడదు? అని అంతే.. అమ్మ మాటలు మనోడిని రియలైజయ్యాయి చేశాయ్. దాంతో పదమూడేళ్లకే తనకంటూ ఓ సొంత బ్యాండ్ క్రియేట్ చేసుకుని సంగీత ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడానికి ముందడుగేశాడు. అలా తన జీవితాన్ని తీర్చిదిద్దిన అమ్మంటే రెహ్మాన్ కి ఆరో ప్రాణం. రాత్రంతా కూచోని ఓ ట్యూన్ కంపోజ్ చేయగానే తెల్లారాక అమ్మకి వినిపించి మురిసిపోయేవాడు. అకాడమీ వేదిక మీద ఆస్కార్ అందుకున్నాక కూడా దీవార్ సినిమాలోని అమ్మ డైలాగ్ వినిపించాడు. మేరే పాస్ మా హై. నా దగ్గర అమ్ముంది అనీ. రెహమాన్ ఏదో ఓ రకంగా తన తల్లిపై ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ని చూయిస్తూనే వచ్చాడు. అలా పుట్టిన పాటే మా తుఝే సలామ్.

మా తుజే సలామ్..

1997లో పెద్ద పెద్ద సినిమాలతో మ్యూజిక్ కంపోజర్ గా తెగ బిజీగా ఉన్నాడు రెహమాన్. ఆ ఏడాది రంజాన్ మాసం 27వ రోజున రాత్రి డైరెక్టర్ భరత్ బాలాకి కాల్ చేశాడు రెహమాన్. కెరీర్ తొలినాళ్లనుంచీ ఆయనతో పరిచయం రెహ్మాన్ కి. అర్జెంటుగా స్టూడియోకి రమ్మనగానే ఏంటా అని కంగారుగా వచ్చాడు భరత్ బాలా. స్టూడియో మొత్తంలో వెలిగించిన ఓ క్యాండిల్ మాత్రమే ఉంది. నేనీరోజే ఇప్పుడే ఓ సాంగ్ రికార్డ్ చేద్దామనుకుంటున్నా. ఈ టైమ్ కి ఎవరూ లేరు, అందుకే మిమ్మల్ని పిలిచా. ఇది ప్లే బటన్, ఇది రికార్డ్, కంగారుపడకండి అని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పి మైక్ దగ్గరికెళ్లాడు రెహమాన్. ఆక్షణం, అమ్మని గుండెల్నిండా తల్చుకుని పాడేశాడు మా తుజే సలామ్ అని. పాడ్డమైపోగానే స్టూడియోలో వింటున్న భరత్ బాలా భావోద్వేగంతో కన్నీళ్లు కార్చాడు. 50వ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా రిలీజయిన ఆ పాట ఆధునిక జాతీయ గీతమైంది. ఎన్నేల్లు విన్నా ఎడ్రినలిన్ రష్ ఫీల్ తగ్గని ఎమోషనల్ సాంగయింది.

దిలీప్ కుమార్‌గా ఓడి.. ఇస్లాం స్వీకరించి..

కెరీర్లో ఇంత సక్సెస్ చూసి ఎందరికో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ఏ ఆర్ రెహమాన్ ఒకప్పుడు దిలీప్ కుమార్‌గా ఫెయిల్యూర్ భయంతో వణికిపోయాడు. అన్నివైపుల నుంచీ కష్టాల్ని చూసి ముందడుగేయలేక ఆగిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఇస్లాం స్వీకరించి అల్లా రఖా రహమాన్ గా మారాడు. కానీ మ్యూజిక్ ని మించిన రెలీజియన్ లేదని ప్రూవ్ చేసి లెజెండరీ కంపోజర్ గా ఎదిగాడు. మ్యూజికల్ గాడయ్యాడు. రాక్ స్టార్ లో కున్ ఫాయా కున్, జోదా అక్బర్ లో ఖ్వాజాజీని ఎంత భక్తిభావంతో కంపోజ్ చేశాడో, మెరుపుకలలు సినిమాలో అపరంజి మదనుడే పాటైనా, కొమరం పులి మూవీలో నమ్మకమియ్యరా సామీ అయినా అదే ఫీల్ తో మ్యూజిక్ ఇవ్వగలడు. కళ్లుమూసుకుని కాంసంట్రేట్ గా వింటే డైరెక్ట్ గా దేవుడితోనూ కాంటాక్ట్ చేయించగలడు. ఏ కంపోజర్.. ఇమేజిన్ కూడా చేయలేని విధంగా డిఫరెంట్ ఇంస్ట్రమెంట్స్‌ని ఇంట్రడ్యూస్ చేయగలడు. ఏ వాయిద్యం వాయించకుండా కూడా పాటని ఎలివేట్ చేయగలడు. దొంగా దొంగా సినిమాలో సీతాలు నువ్వు లేక నేను లేనే పాటలాంటివి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్.

ఎల్లా పుగలుమ్ ఇరైవనుక్కే

ఓవైపు బాలు, చిత్ర, లతా మంగేష్కర్ లాంటి లెజెండరీ సింగర్స్ తోనూ పాడించి క్లాసిక్ టేస్ట్ చూయించగలడూ. సిద్ శ్రీరామ్, శక్తి శ్రీ గోపాలన్, చిన్మయి, బాంబే జయశ్రీ లాంటి సింగర్స్ వాయిస్‌ను ఆడియెన్సు కు మరింత దగ్గరచేసి మెస్మరైజూ చేయగలిగి తరాల గుండెల్ని తాకగలడు. ఇంకా చెప్పాలంటే.. రోజా మూవీలో పెళ్లిచూపులప్పుడొచ్చే ఓ ట్రెడిషనల్ టైప్ బీజీఎం ని కాస్త టెంపో మార్చి, సౌండ్స్ యాడ్ చేసి తర్వాత భారతీయుడు మూవీలో టెలిఫోన్ ధ్వనిలా లాంటి డ్యూయెట్ సాంగ్ చరణానికి ట్యూన్ గా మార్చేశాడు. రెహ్మాన్ మ్యూజిక్ పరంగా ఎంత జీనీయసో చెప్పడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొకొల్లలు గురూ. ఇంత చేసినా.. ఎంత ఎదిగినా, ఏ అవార్డు తీసుకున్నా, ఏ స్టేజీ మీదున్నా ఒకే మాట చెప్తాడు. ఎల్లా పుగలుమ్ ఇరైవనుక్కే. అని.. అంటే ఆల్ ప్రెయిజ్ బీ టు గాడ్ అని. దటీజ్ రెహ్మాన్.
ఇప్పటికీ ఆ మాటకొస్తే ఎప్పటికీ మ్యూజిక్ లవర్స్ దూరాన్ని కిలోమీటర్లలో కొలవరు. రెహమాన్ సాంగ్స్, ఆల్బమ్సుల్లో కొలుస్తారు. ఎందుకంటే ఆయన పాటలు వింటుంటే దూరం కనిపించదు. గుండెల్లో ఎలాంటి బరువున్నా భారం అనిపించదు. అంతటి స్వర స్వతంత్రుడు. గాన మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్.

రెహమాన్ ఈజ్ ఏన్ ఇన్‌స్పిరేషన్..

మ్యూజిక్ పరంగానే కాదు.. అన్నిరకాలుగా కూడా సరికొత్తగా, అందరికంటే భిన్నంగా ఏది చెయ్యాలనుకున్నా కూడా రెహమాన్ ఇన్ స్పిరేషనే. అందరూ డే టైమ్ లో మ్యూజిక్ కంపోజ్ చేస్తే రెమ్మాన్ మాత్రం నైట్ టైమ్ లో మ్యాజికల్ ట్యూన్స్ కోసం మ్యూజిక్ చేస్తుంటాడు. రెహమాన్ స్టయిల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో మణిరత్నం మాటల్లో చెప్పాలంటే.. ఇళయరాజా రీల్స్ వైజ్ గా సీన్స్ కి మ్యూజిక్ అండ్ బీజీఎం కంపోజ్ చేస్తే రెహమాన్ మాత్రం నచ్చిన సీన్ వైజ్ గా కంపోజ్ చేస్తాడట. ఇదిలానే చేయాలి అనే రొటీన్ ఫార్ములాకి భిన్నంగా వెళ్తూ, తన ఐడెంటెటినీ, యూనిక్ టాలెంట్ నీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కాబట్టే రెహ్మాన్ మ్యూజికల్ బ్రాండయ్యాడు. కొన్ని కోట్ల మందికి మర్చిపోలేని మెమరీస్ నిచ్చిన క్రియేటరయ్యాడు. మాటల్లో ఎక్స్ ప్రెస్ చేయలేని ఎన్నో ఫీలింగ్స్ కి ట్యూన్స్ కట్టి మంచి పాటయ్యాడు. దునియా ఉన్నన్నాళ్లు రెహమానియా ఉంటుందనిపించుకున్నాడు.

హ్మ్.. సివరాకరికి ఎంత కాదనుకున్నా ఒకప్పటి రెహ్మాన్ మ్యూజిక్ ని ఇప్పటి ఆల్బమ్సుల్లో మిస్సవుతున్నాం అని అప్పుడప్పుడు కా..స్త అనిపించినా.. మళ్లీ ఏ కాలర్ ట్యూన్ తోనో, రింగ్ టోన్ తోనో కొన్ని సెకన్ల పాటు అలా వినిపించినా చాలు.. ఏల్ల ఎనక్కెల్లయినా ఆయన మ్యూజిక్ లో మునిగితేలుతాం. దటీజ్ ఏ ఆర్ రెహ్మాన్. దట్స్ వై సలామ్ రెహ్మాన్.