పాపమని పామును కాపాడబోయాడు.. అది కాటు వేసి!
విషం చిమ్మే పాము అని తెలిసినా దానిని కాపాడబోయిన పాపానికి దాని కాటుకే బలయ్యాడో వ్యక్తి. కంచెలో చిక్కుకున్న తనను కాపాడబోయిన మనిషిని అది చంపేస్తోందని భావించింది.. అంతే ఆయనను కాటేసి చంపేసింది. తమిళనాడులోని మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపంలోని ఆరపాక్కం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరపాక్కం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాజశేఖర్ అనే వ్యక్తి గ్రామంలో కిరాణా షాపు నిర్వహించుకుని జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం షాపు తెరిచిన కొద్దిసేపటికే పక్కింట్లో పాము పాము అనే అరుపులు వినిపించాయి. దీంతో రాజశేఖర్ అక్కడికి పరుగున వెళ్లాడు.
వారి ఇంటి వెనుక నిర్మించిన ఇనుప కంచెలో పాము చిక్కుకుని ఉంది. దానిని చూసి అందరూ పెద్దగా అరుస్తున్నారు. రాజశేఖర్ దానిని చంపకుండా కాపాడి అడవిలో వదిలేద్దాం అనుకున్నాడు. ఇనుప కంచెలో చిక్కుకున్న దానిని జాగ్రత్తగా తప్పించి విడిచిపెడుతుంగానే.. ఆ పాము అతన్ని కాటేసి సమీపంలోని పొదల్లోకి పారిపోయింది. స్థానికులు వెంటనే రాజశేఖర్‌ను శీర్గాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అతన్ని చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్ కన్నుమూశాడు. అతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.