అరవింద కథ నాదే.. త్రివిక్రమ్ తెలివైన మూర్ఖుడు.. రచయిత వేంపల్లి గంగాధర్ - MicTv.in - Telugu News
mictv telugu

అరవింద కథ నాదే.. త్రివిక్రమ్ తెలివైన మూర్ఖుడు.. రచయిత వేంపల్లి గంగాధర్

October 15, 2018

సినిమా రంగంలో ముందుగా మోసపోయేది ఎవరని చెప్తే రచయితలే అని చెబుతారు. రచయిత ఐడియాలే వాళ్ళ ఫ్యూచర్‌కు దిక్సూచి అవుతాయి. అలాంటి ఐడియాలు డిస్కషన్‌ల రూపంలో చౌర్యానికి గురవుతుంటాయి. ఇప్పటికి అలా చాలా మంది రచయితలు తమ కథలు, ఐడియాలు దొంగిలించబడ్డాయని వెలుగులోకి వచ్చారు. ఒక ఐడియా వచ్చి దాన్ని డెవ్‌లప్ చెయ్యాలంటే రచయిత అన్నవాడు ఎంతో మనోసంఘర్ణణకు గురవుతారు. కథతో ప్రయాణం చేస్తాడు. ఆ కథా ప్రపచంలోకి వెళ్తాడు. అలా ఓ స్త్రీ 9 నెలలు బిడ్డను మోసి, కన్నట్టు రచయిత కథను కూడా మోసి కంటాడు.Aravinda sametha is a story mineఅలా కన్న కథ ఎవరైనా దొంగిలిస్తే ఏ రచయితకైనా మండుతుంది. బడా దర్శకులం అనే ముసుగులో చాలా మంది దర్శక నిర్మాతలు రచయిత క్రియేటివిటీని దోచుకుంటున్నారు. బహుశా ఈ దోపిడీకి ధీటుగానే రచయితలు, దర్శకులుగా మారడం ప్రారంభించారేమో. కొందరైతే పుస్తకాల్లో అచ్చయిన కథలను చదివి, కాస్త అటూ ఇటూ నేపథ్యమో, కథనో చిన్నగా మార్చి కొత్త కథను తయారు చేసుకుని అదేదో తమ కథ అన్నట్టు పేరు వేసుకుంటారు. ఇలాంటి దారుణాలకు పాల్పడేవాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలుగా వున్నారు. కథ రాసిన సదరు రచయిత కథ తీసుకుని, అతనికింత పారితోషకం ఇచ్చి, పేరు వేస్తే వీళ్ళ సొమ్మంతా పోయినట్టు కథలను దొంగిలిస్తుంటారు.  

తాజాగా అలాంటి ఓ ఘటన మన టాలీవుడ్‌లో చోటు చేసుకుంది.

అరవింద సమేత కథ నాది…

ఎన్టీఆర్, పూజా హెగ్డేల కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ చిత్రం కథ కూడా దొంగ కథనే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కథ తనదేనంటూ వేంపల్లి గంగాధర్ అనే వ్యక్తి సాక్షాధారాలతో సహా బయటపెట్టాడు. ఏప్రిలో 15న త్రివిక్రమ్ నుంచి తొలి సారి తనకు ఫోన్ వచ్చిందని, ఆయన పిలుపు మేరకు హుటాహుటిన రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లానని చెప్పాడు. అప్పటికే ఫస్ట్ ఫైట్ తీస్తున్నారని చెప్పాడు. షాట్ గ్యాప్‌లో త్రివిక్రమ్‌తో పరిచయం అయిందని…

తన ‘హిరణ్య రాజ్యం’ పుస్తకంలోని కథనాన్ని హీరోయిన్ పాత్రకు ఆపాదించారని చెప్పాడు. తన పాపాగ్ని కథల్లో ఉన్న ‘మొండి కత్తి’ నేపథ్యం గురించి తెలుసుకున్నారని… కథకు పునాది మొండి కత్తేనని గంగాధర్ చెప్పాడు. త్రివిక్రమ్ తెలివైన మూర్ఖుడని, రకరకాల కథల్లోంచి ఒక్కో పాత్రను దొంగిలించి కొత్త కథను అల్లగలడని చెప్పారు. అలా వండిన మరో కథే ‘అరవింద సమేత’ అని చెప్పారు.

తాను రాసిన పుస్తకాల గురించి త్రివిక్రమ్ తెలుసుకున్నారని గంగాధర్ తెలిపాడు. రాయలసీమ ఫ్యాక్షన్ కథలపై పరిశోధన చేసి శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి సర్టిఫికెట్ పొందిన విషయం విని, తనను అభినందించారని చెప్పాడు. ఆ తర్వాత రాయలసీమ మాండలికాల గురించి తెలుసుకున్నారని  తెలిపారు. త్రివిక్రమ్‌ను కలిసి, తన కథల గురించి లోతుగా చెప్పడం తాను చేసిన మొదటి తప్పని తెలిపాడు.